సాగులో సాంకేతికత | - | Sakshi
Sakshi News home page

సాగులో సాంకేతికత

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

ఎస్‌ఎమ్‌ఏఎమ్‌ పథకం కింద 40 శాతం సబ్సిడీపై డ్రోన్లు జిల్లాలో ఇప్పటికే మూడు సొసైటీలకు పంపిణీ వ్యక్తిగతంగా రైతులు కూడా పొందే అవకాశం

దహెగాం: రోజురోజుకూ సాగులో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అరకలు అదృశ్యమవుతుండగా ట్రాక్టర్లు, రోట్‌వేటర్‌లతో పొలాలు దున్నుతున్నారు. ప్రారంభంలో పంటలను క్రిమికీటకాల నుంచి కాపాడుకోవడానికి స్ప్రే పంపులు వినియోగించగా, తర్వాత తైవాన్‌ స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మరింత టెక్నాలజీతో డ్రోన్లు వినియోగంలోకి వస్తున్నాయి. సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ ప థకం కింద 40శాతం సబ్సిడీతో అందించనున్నారు. డ్రోన్ల సహాయంతో సుమారు 25 నిమిషాల్లోనే పది ఎకరాల్లో పంటలకు మందులు పిచికారీ చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలోని మూడు సహకార సంఘాలకు 40 శాతం సబ్సిడీతో అందించగా, వ్యక్తిగతంగా రైతులకు కూడా అందించనున్నారు.

4.50 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలోని 15 మండలాల్లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో బోరు బావులపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. సాగులో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి తక్కువ ఖ ర్చుతో అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు సబ్సిడీపై మంజూరు చేస్తున్నా రు. ఈ క్రమంలోనే పంటలకు మందులు పిచికారీ చేయడానికి సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌(ఎస్‌ఎమ్‌ఏఎమ్‌) పథకం కింద స్ప్రే డ్రోన్లను 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. మూడు రోజు ల క్రితం సిర్పూర్‌ నియోజకవర్గంలోని దహెగాం, కౌటాల మండలం గురుడుపేట, కాగజ్‌నగర్‌ మండలం కొత్తపేట సొసైటీలకు సబ్సిడీపై మంజూరైన డ్రోన్లను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్‌, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌ పంపిణీ చేశారు. సహకార సంఘాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా రైతులకు 40 శాతం సబ్సిడీపై అందిస్తామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

25 నిమిషాల్లో పదెకరాలు పిచికారీ

పంటలకు మందులు పిచికారీ చేయాలంటే తైవాన్‌ స్ప్రే, హ్యాండ్‌ పంపుతో సమయం ఎక్కువగా పడుతుంది. ఎకరం పొలం పిచికారీ చేయాలంటే అరగంట నుంచి గంట వెచ్చించాల్సి వస్తుంది. అయితే డ్రోన్‌ ద్వారా పదెకరాల పొలానికి పట్టే సమయం కేవలం 25 నిమిషాలేనని అధికారులు పేర్కొంటున్నారు. దీని ద్వారా రైతులకు సమయం ఆదా అవుతుంది. సొసైటీలకు ఇచ్చిన డ్రోన్లను ఆపరేట్‌ చేయడానికి పైలట్‌ను నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సొసైటీల వద్ద ఉన్న డ్రోన్లను రైతులు అద్దెకు తీసుకోవచ్చు. డ్రోన్‌లో 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంటుంది. స్ప్రే చేసే ముందు పొలం చుట్టూ తిరిగి హద్దులు పెట్టుకున్న తర్వాత ఆపరేటింగ్‌ చేస్తారు.

రూ.6 నుంచి రూ.9 లక్షల విలువ

పంటలకు మందులు పిచికారీ చేసే ఒక్కో డ్రోన్‌ వి లువ రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ పథకం కింద 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అలాగే బ్యాటరీలు, ఒక జనరేటర్‌ సైతం అందిస్తారు. రైతులు సొంతంగా తీసుకుంటే అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. డ్రోన్‌ను అద్దెకు తీసుకుంటే గంటకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించా ల్సి ఉంటుంది. రోజుకు కనీసం 50 ఎకరాలకు పైగా నే మందులు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement