కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పరిధిలో కోఆప్షన్ పదవుల సందడి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. నేటితో గడువు ముగియనుండగా, ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో తేలనుంది. ఎవరికివారు ప్రస్తుతం లాబీయింగ్ చేసుకుంటున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకున్నాయి. చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ కొత్తపల్లి అనిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికై న 60 రోజుల వ్యవధిలో కచ్చితంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. దీంతో అధికారులు ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం దరఖాస్తు గడువు ముగియనుంది. రెండో రోజులు దరఖాస్తుల పరిశీలన చేపట్టి తర్వాత ఎన్నిక తేదీని ప్రకటిస్తారు. పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి చెందిన వారికి పదవులు దక్కుతాయో వేచి చూడాల్సి ఉంది.
మద్దతు కోసం లాబీయింగ్
కోఆప్షన్ ఎన్నికలో సంఖ్యాబలం మాత్రమే కాకుండా అంతర్గత సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతీ ఓటు విలువైనదిగా మారనుంది. కౌన్సిలర్ల మధ్య గట్టి లాబీయింగ్ జరుగుతోంది. కౌన్సిలర్ల మద్దతు కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమి షం వరకు సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో స్పష్టత లేదు. చివరి క్షణంలో మారే సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
నిర్ణయాల్లో కీలకపాత్ర
మున్సిపాలిటీలో ఎన్నుకున్న కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తారు. పాలనలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కమిటీలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభివృద్ధి పనులపై సూచనలు ఇవ్వడం, స్థానిక సమస్యలను చర్చకు తీసుకురావడం. ప్రజల అవసరాలను అధికారులకు తెలియజేస్తారు. ప్రత్యక్ష్యంగా ఎన్నిక కాకపోయినా పాలనలో మాత్రం వీరు కీలక పాత్ర పోషిస్తారు.
ఆశావహుల్లో మాజీలు
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్నారు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కోటాలో రెండు పదవుల కోసం మాజీ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల్లో కూడా మాజీలు అధికంగా ఉన్నారు. వీరంతా ఈ పదవులు దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటాలో ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్ట్‌లు పోటీ పడుతున్నారు. ఇక బీఆర్‌ఎస్ కూడా కొంతమంది కౌన్సిలర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకుని పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


