డిగ్రీలో డుమ్మాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

డిగ్రీలో డుమ్మాలకు చెక్‌

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

● ప్రభుత్వ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు ● విద్యార్థులతో పాటు అధ్యాపకులకు అమలు

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆధునిక కాలంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యారంగంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యార్థులు, అధ్యాపకుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాత హాజరు పద్ధతులకు స్వస్తి పలకనుంది. డుమ్మాలకు చెక్‌ పెడుతూ ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థులకు, విధుల్లో అలసత్వం వహించే సిబ్బందికి చెక్‌ పెడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలను సరికొత్త శిఖరాలకు చేర్చే దిశగా ముఖ గుర్తింపు ప్రక్రియ మైలురాయిగా నిలవనుంది.

బయోమెట్రిక్‌కు స్వస్తి

ఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పని చేయకపోవడం, కృత్రిమంగా వేలిముద్రలు వాడటం వంటి కారణాలతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను తీసుకువచ్చింది. రెయింట్‌ ఏఐ సొల్యూషన్స్‌ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ సాగుతుంది. అధ్యాపకులు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేయవచ్చు. అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి యాప్‌లో తమ పేరు, ముఖం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌ ద్వారా ప్రతిరోజూ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్‌ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. కళాశాల లొకేషన్‌లో మాత్రమే యాప్‌ పని చేస్తుంది. ఫోన్‌లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్‌లో నమోదవుతుంది. దీంతో ఎంత మంది కళాశాలకు వచ్చారు.. ఎంత మంది గైర్హాజరయ్యారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది.

4,583 మంది విద్యార్థులు

జిల్లాలో 3 ప్రభుత్వ, 6 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా, 149 మంది అధ్యాపకులు, 4,583 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతోపాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారికి స్కాలర్‌షిప్‌ నిలిచిపోనుంది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్‌ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

హాజరు శాతం పెరుగుతుంది

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఫేస్‌ రికగ్నిషన్‌తో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. కళాశాలలో అధ్యాపకులు కూడా సక్రమంగా విధులకు హాజరవుతారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ సక్రమంగా అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.

– శ్రీదేవి, కాగజ్‌నగర్‌ ప్రభుత్వ

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement