కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: కాజిపేట నుంచి బల్లార్షా వరకు రైల్వే మూడో లైన్ పనుల్లో భాగంగా కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగుపై చేపడుతున్న నూతన బ్రిడ్జి వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాక్స్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే క్రమంలో గాడర్లు జరిగి పశ్చిమబెంగాల్‌కు చెందిన రవితో పాటు రాజీవ్, అనుజ్, కన్నయ్య, ముస్తాఫా గాయపడ్డారు. రవి మాత్రం గాడర్ల మధ్యలో ఇరుక్కుని బయటకు రాలేకపోవడంతో తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు ధైర్యం చెబుతూ సిలిండర్‌తో ఆక్సిజన్ అందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి గాడర్లను కట్ చేసి క్షతగాత్రుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్ రోడ్– సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 208/23/13 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనులు చేపట్టే క్రమంలో కార్మికులకు హెల్మెట్, సెఫ్టీ బెల్ట్, జాకెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ పని ప్రదేశంలో కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సరైన రక్షణ పరికరాలు అందించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన
రైల్వే వంతెన ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు ముంజం ఆనంద్‌కుమార్ డిమాండ్ చేశారు. గాయపడిన కా ర్మికులను బుధవారం పట్టణంలోని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఎలాంటి భద్ర త లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయించడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


