● విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా ● దాడులు ముమ్మరం చేసిన పోలీసుశాఖ ● ఇటీవల బెజ్జూర్‌లో రూ.90వేల విలువైన గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

● విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా ● దాడులు ముమ్మరం చేసిన పోలీసుశాఖ ● ఇటీవల బెజ్జూర్‌లో రూ.90వేల విలువైన గంజాయి పట్టివేత

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

● విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా ● దాడులు ముమ్మరం చేసిన పోలీసుశాఖ ● ఇటీవల బెజ్జూర్‌లో రూ.90వేల విలువైన గంజాయి పట్టివేత

కౌటాల: మత్తు పదార్థాల రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో త క్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విక్రయాలు జరుపుతున్నారు. ము ఖ్యంగా మంచిర్యాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గతేడాది జిల్లాలో 73 గంజాయి రవాణా కేసులు నమోదు కాగా, 15.224 కిలోల గంజాయి, 1,118 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు

జిల్లాలోని సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, వాంకిడి, సిర్పూర్‌(టి) మండలాల మీదుగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా మంచిర్యాల జిల్లాకు గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న మూడు కిలోల గంజాయిను బెజ్జూర్‌ పోలీసులు పట్టుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్‌లతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ.300 నుంచి రూ.1000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

బానిసలుగా మారుతున్న యువత

జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతికి అడ్డుకట్ట పడటం లేదు. చదువుకునే వయస్సులోనే యువత గ్యాంగ్‌లుగా మారి వ్యసనానికి బానిసవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సమాచారం పంచుకుంటున్నారు. మద్యంతో పోలిస్తే ఇతర మత్తు పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. వాటిని వదలలేకపోతున్నారు. గంజాయిలోని టెట్రా హైడ్రోకానాబినాల్‌ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. వ్యసనాన్ని మానకపోతే తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి సైతం దారి తీయొచ్చు.

కేసులు నమోదు చేస్తాం

గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలి. మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వినియోగం నేరం. అక్రమ దందాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తాం. మహారాష్ట్ర నుంచి రవాణా జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశాం. మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి.

– బి.సంతోష్‌కుమార్‌, సీఐ, కౌటాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement