ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాల విద్యార్థులకు బుధవారం నుంచి ఈ నెల 1 వరకు సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్‌ఏ– 2) పరీక్షలు జరగనున్నాయి. దీని కోసం ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1వ నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:45 గంటలు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 9వ తరగతి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. వార్షిక పరీక్షలో 80 మార్కులు ఉండగా.. మిగతా 20 మార్కులు ప్రాక్టికల్స్‌లో ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
75,218 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద మొత్తం 1,244 పాఠశాలలు ఉండగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు 75,218 మంది చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ నెల 18తో పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే ఎస్‌ఏ– 1తోపాటు పాఠ్యాంశాల మార్కులు, హాజరు వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేశారు. విద్యార్థుల వారీగా హాజరు, మార్కుల వివరాలను విద్యాశాఖ సంచాలకుల వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
23న ప్రోగ్రెస్ కార్డులు
ఈ నెల 23తో 2025– 26 విద్యా సంవత్సరం ముగియనుంది. ఆ లోగా సంబంధిత ఉపాధ్యాయులు జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. 1వ నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలు బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్షల ప్రగతిని ప్రధానోపాధ్యాయులు విధిగా ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసే ప్రక్రియను ఈ నెల 22 వరకు పూర్తి చేయాలి. ఈ నెల 23న చివరి రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు వారి సమక్షంలోనే ప్రోగ్రెస్ కార్డులు అందించాలి.
టైం టేబుల్ ప్రకారం నిర్వహించాలి
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టైం టేబుల్ ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించాలి. మార్కుల వివరాలు ఆన్‌లైన్ నమోదు చేయాలి. ఈ నెల 23న తల్లిదండ్రుల సమక్షంలో ప్రోగ్రెస్ కార్డులు అందించాలి.
– జనార్దన్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి


