చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

Dec 30 2025 7:49 AM | Updated on Dec 30 2025 7:49 AM

చలికా

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

పిల్లలు వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం స్వీయ నియంత్రణతోనే వ్యాధులు దూరం ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో డీఎంహెచ్‌వో కుమ్రం సీతారాం

ఆసిఫాబాద్‌అర్బన్‌: ‘జిల్లాలో విపరీతమైన చలి, పొగమంచు కారణంగా కొద్దిరోజులుగా పగటిపూట కూడా చల్లగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి..’ అని డీఎంహెచ్‌వో కుమ్రం సీతారాం అన్నారు. చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలువురు ఫోన్‌ ద్వారా అడిగిన సందేహాలకు డీఎంహెచ్‌వో వివరంగా సమాధానాలు ఇచ్చారు.

ప్రశ్న: చలి తీవ్రతతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి? వ్యాధిగ్రస్తులకు మీరిచ్చే సూచనలు ఏంటి..? : చీల నితీష్‌, రాజంపేట/పద్మ, ఆసిఫాబాద్‌

డీఎంహెచ్‌వో: చలి గాలుల ప్రభావంతో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ, చర్మం పొడిబారడం, జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి జ్వరం వస్తే ఏం చేయాలి? : ఠాకూర్‌ వనిత, రాజంపేట/మహేశ్వరీ, కౌటాల

డీఎంహెచ్‌వో: చలి, వేడిని తట్టుకొనే శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది. రాత్రి, తెల్లవారుజామున పిల్లలను బయటికి తీసుకెళ్లొద్దు. జలుబు, దగ్గు వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయకుండా పిల్లల నిపుణులను సంప్రదించాలి. వేడి నీటితోనే వారికి స్నానం చేయించాలి. అవసరమైతే పాఠశాలలకు కూడా స్వెట్టర్లతోనే పంపించాలి.

ప్రశ్న: ఉదయం వాకింగ్‌కు వెళ్లవచ్చా..? : కోసరి మహేశ్‌, జన్కాపూర్‌

డీఎంహెచ్‌వో: ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటోంది. చలితీవ్రత తగ్గిన తర్వాత వాకింగ్‌ వెళ్లాలి. ఇంట్లోనే వ్యాయామం చేయడం మేలు. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: అస్తమా, పెరాలసిస్‌ రోగులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? : నికోడె సంతోష్‌, ఎల్లారం/బుర్ల సంతోష్‌, ఎల్లారం

డీఎంహెచ్‌వో: అస్తమా రోగులు చలిలో బయటకు వెళ్లొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూమోనియా వ్యాధిగ్రస్తుల కోసం డా.రవీందర్‌ అందుబాటులో ఉన్నారు. పెరాలసిస్‌ పేషంట్లు కూడా చలిలో బయట తిరగొద్దు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: చలికి వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి మీరిచ్చే సలహాలు. : జగదీష్‌, ముత్యంపేట, మం.కౌటాల

డీఎంహెచ్‌వో: చలి, మంచు తగ్గేవరకు ఇళ్లలోనే ఉండడం ఉత్తమం. డాక్టర్ల సూచనల మేరకు ఇప్పటికే వాడుతున్న మందులు కొనసాగించాలి. ఇబ్బందులు ఉంటే మరోసారి ఆస్పత్రులకు వెళ్లాలి.

ప్రశ్న: చలి మంటలు వేసుకోవడం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? : కోండ్ర రాజేశ్వర్‌, ఆసిఫాబాద్‌

డీఎంహెచ్‌వో: చలి మంటలతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పొగతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. అస్తమా, జలుబు, దగ్గు ఉంటే తీవ్రమవుతాయి. చలి మంటలు వేసుకోవడం కంటే కాటన్‌ దుస్తులు, స్వెట్టర్లు, రగ్గులు వినియోగిస్తే మంచిది.

ప్రశ్న: చర్మ సమస్యలు వస్తే ఏం చేయాలి?

: జగన్నాథ్‌, కౌటాల

డీఎంహెచ్‌వో: చలికాలం చేతులు, కాళ్లు, శరీరం పగుళ్లకు గురవుతుంటాయి. అవసరం మేరకు వైద్యుల సూచించిన లోషన్లు వాడాలి. కాళ్లు, చేతులకు సాక్స్‌ వేసుకోవడం ఉత్తమం. శరీరానికి దుమ్ము తగలకుండా దుస్తులు వేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు ఉంటే తరచూ గోర్లతో గోకొద్దు.

ప్రశ్న: నా వయస్సు 75 ఏళ్లు. ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి? : మాటూరి మల్లమ్మ, ఆసిఫాబాద్‌

డీఎంహెచ్‌వో: మీకు వయస్సు ఎక్కువగా ఉన్నందున డీ విటమిన్‌ మాత్రలు వాడాలి. వారానికి ఒకటి చొప్పున వరుసగా రెండు నెలలు వాడితే నొప్పులు తగ్గుతాయి. చలికి నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మూడు నెలలకోసారి వైద్యుడిని సంప్రదించాలి.

ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? : మరియాల వినీత్‌కుమార్‌, ఆసిఫాబాద్‌/మడావి విష్ణువర్ధన్‌, తుమ్మిడిహెట్టి, మం.కౌటాల

డీఎంహెచ్‌వో: నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేసినవి, బయట లభించే చిరుతిళ్లు, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. తగిన మోతాదులో రోజు కు సుమారు మూడు లీటర్ల నీటిని తాగాలి. లేకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దగ్గు, జలుబు ఉంటే మాత్రం పులుపు పదార్థాలు తగ్గించాలి. వారానికి రెండుసార్లు మాంసాహారం తీసుకోవచ్చు.

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి1
1/1

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement