‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు | - | Sakshi
Sakshi News home page

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు

Dec 29 2025 8:09 AM | Updated on Dec 29 2025 8:09 AM

‘ఇంటి

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు

జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి అంతంతే..

అరకొరగా విద్య, వైద్య సౌకర్యాలు

అసంపూర్తిగా వంతెనలు

‘ప్రాణహిత’ ప్రాజెక్టుపైనే జిల్లా ప్రజల ఆశలు

ఆసిఫాబాద్‌: ఈ ఏడాదీ జిల్లా అభివృద్ధికి అనుకున్న స్థాయిలో అడుగులు పడలేదు. వైద్యసేవలు అరకొ రగా అందుతుండగా, విద్యాపరంగా జిల్లాపై ఉదా సీనత కొనసాగింది. సాగునీటి రంగంపైనా వివక్ష వీడలేదు. ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న వంతెనలు పూర్తిచేసేందుకు నిధులు మంజూరు కాలేదు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్‌లో మినీ స్టేడియం నిర్మించినప్పటికీ జిల్లా ఏర్పాటు నుంచి అక్కడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. కేవలం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టడం జిల్లా రైతాంగానికి ఊరట కలిగిస్తోంది.

స్థాయి పెంచినా.. మెరుగుపడని సేవలు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత ఉంది. ఆస్పత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసినా సేవలు మెరుగుపడలేదని రోగులు వాపోతున్నారు. సూపరింటెండెంట్‌, 150 మంది వైద్యులకు కేవలం 30 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 80 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు ఉన్నారు. ప్రతిరోజూ సుమారు 600 ఔట్‌ పేషెంట్లు, పదుల సంఖ్యలో ఇన్‌పేషెంట్లు చేరుతున్నారు. గతంలో నెలకు సుమారు 40 కాన్పులు జరగగా, ప్రస్తుతం 15 నుంచి 20కి తగ్గింది. గైనకాలజిస్టు, ఫోరెన్సిక్‌, రేడియాలజిస్టు, సైక్రియాట్రిస్టు, కంటి వైద్యులు, స్పెషలైజ్‌ డాక్టర్లు లేరు. సిజేరియన్లు, హృదయ, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సకు మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి మంచిర్యాలకు రెఫర్‌ చేస్తున్నారు. ప్రత్యేక రేడియాలజీ విభాగం ఉన్నా రేడియాలజిస్టు లేకపోవడంతో గర్భిణులకు స్కానింగ్‌ చేయడం లేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఆపరేషన్‌ థియేటర్‌ నిరుపయోగంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సేవలందించేందుకు గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినా ప్రస్తుతం అవి పనిచేయడం లేదు.

‘ప్రాణహిత’లో కదలిక

కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ఏడాది ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత మేలో కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో ప్రాణహిత నది వెంట రిటైర్డ్‌ ఇంజినీర్‌ విఠల్‌రావు ఆధ్వర్యంలోని ఎస్వీ కన్సల్టెన్సీ సర్వే చేశారు. ప్రాణహిత నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 165 టీఎంసీల నీటిని ఒడిసిపట్టనున్నారు. రూ.4,500 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారా.. లేదా సుందిళ్ల ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గ్రావిటీ ద్వారా సుందిళ్ల ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎనిమిది కొత్త పరిశ్రమలు

పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ ద్వారా కొత్త అనుమతులు ఇస్తున్నా జిల్లాలో ఆశించిన అభివృద్ధి కానరావడం లేదు. జిల్లాలో 36 రైస్‌మిల్లులు, 24 జిన్నింగ్‌ మిల్లులు, నాలుగు సిరామిక్స్‌ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, చిన్న పరిశ్రమలు మొత్తం 265 వరకు ఉన్నాయి. టీఎస్‌ ఐపాస్‌ కింద ఈ ఏడాది ఎనిమిది కొత్త పరిశ్రమలు మంజూరైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అశోక్‌ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఖనిజాలు, అడవులు, సున్నపు రాయి తదితర వనరులు ఉన్నప్పటికీ పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలో సోమేశ్వర, అన్నపూర్ణ, సత్యనారాయణ సిమెంట్‌ కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం అవి మూతపడ్డాయి. కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులు పునరుద్ధరణ తర్వాత విజయవంతంగా కొనసాగుతోంది. కానీ పట్టణంలోని సర్‌సిల్క్‌ కంపెనీ భూములను వేలం వేసేందుకు నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. విలువైన భూముల్లో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వైద్యశాలలో 120 ఖాళీలు

వాంకిడి మండలంలోని ఇందాని శివారులో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మించనున్నారు. ఇప్పటికే స్థల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. సంబంధిత కంపెనీ స్థల పరిశీలన కూడా పూర్తిచేసింది. ఈ పాఠశాల భవనం పూర్తయితే జిల్లాలోని పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా రెసిడెన్షియల్‌ విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు 2560 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. అయితే జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఐటీఐ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌ శివారులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యకళాశాలలో నీట్‌ ద్వారా ఇప్పటివరకు ఏటా వంద మంది చొప్పున 300 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తొలుత 300 పడకల ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న భవనాన్ని ప్రస్తుతం వైద్య కళాశాలగా మార్చారు. వైద్య కళాశాలలో 17 మంది ప్రొఫెసర్లకు ఇద్దరు, 27 మంది అసోసియెట్‌ ప్రొఫెసర్లకు ఒక్కరు, 41 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 16 మంది, 40 మంది సీనియర్‌ రెసిడెంట్లకు 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 25 మంది ట్యూటర్‌/డెమో పోస్టులకు ఒక్కరు కూడా లేరు. 150 మందికి కేవలం 30 మంది మాత్రమే పని చేస్తుండగా 120 ఖాళీలు ఉన్నాయి.

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు1
1/3

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు2
2/3

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు3
3/3

‘ఇంటిగ్రేటెడ్‌’కు అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement