‘ఫర్టిలైజర్‌’ యాప్‌పై అనుమానాలొద్దు | - | Sakshi
Sakshi News home page

‘ఫర్టిలైజర్‌’ యాప్‌పై అనుమానాలొద్దు

Dec 29 2025 8:09 AM | Updated on Dec 29 2025 8:09 AM

‘ఫర్ట

‘ఫర్టిలైజర్‌’ యాప్‌పై అనుమానాలొద్దు

ఇంటి నుంచే యూరియా బుక్‌ చేసుకోవచ్చు

విస్తృతంగా అవగాహన కల్పిస్తాం..

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటి

ఆసిఫాబాద్‌రూరల్‌: ‘యూరియా కోసం రైతుల నిరీక్షణకు చెక్‌ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటి నుంచే ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని యూరియా పొందవచ్చు. దీనిపై జిల్లా రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దు, విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటి అన్నారు. కిసాన్‌ కపాస్‌ యాప్‌ మాదిరిగానే ఈ యాప్‌ను అన్నదాతలు సులువుగా వినియోగించవచ్చని అ న్నారు. జనవరి రెండో వారం నుంచి జిల్లాలో యా ప్‌ను అమల్లోకి తీసుకురానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు.

సాక్షి: యాప్‌ ద్వారా యూరియా కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉంటాయా?

డీఏవో: యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. ఇంటి వద్ద నుంచే ఫోన్‌లోనే అవసరమైన యూరియా బుక్‌ చేసుకుని తెచ్చుకోవచ్చు. యాసంగి సీజన్‌ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం పత్తి అమ్ముకునేందుకు వాడుతున్న కిసాన్‌ కపాస్‌ యాప్‌లాగే యాప్‌తో యూరియా కొనుగోలు చేసుకోవచ్చు.

సాక్షి: జిల్లా రైతులకు ఎప్పటి నుంచి సేవలు అమల్లోకి వస్తాయి.. అవగాహన కల్పిస్తున్నారా?

డీఏవో: జిల్లాలో జనవరి రెండో వారం నుంచి యూరియా యాప్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వ్యవసాయ అధికారులకు యాప్‌పై శిక్షణ పూర్తయ్యింది. మండలాల వారీగా వ్యవసాయాధికారులు, డీలర్లు, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. యాసంగి సీజన్‌లో వరి పంటకు యాప్‌ ద్వారానే యూరియా బుక్‌ చేసుకోవాలి.

సాక్షి: యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు.. యూరియా ఎంత అవసరం ఉంటుంది?

డీఏవో: జిల్లాలో మొత్తం 4,45,049 ఎకరాల సాగు భూమి ఉంది. 1.48 లక్షల మంది రైతులు పంటలు పండిస్తున్నారు. యాసంగి సీజన్‌లో 38 వేల ఎకరాల్లో వరి, ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తారు. ఈ పంటలకు ఐదు వేల టన్నులు యూరియా అవసరం ఉంటుందని గుర్తించాం. ప్రస్తుతం దానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 92 ఫర్టిలైజర్‌ షాపుల్లో ఎక్కడ స్టాక్‌ ఉన్నా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఏ దుకాణంలోనైనా బుక్‌ చేసుకోవచ్చు.

సాక్షి: జిల్లాలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి?

డీఏవో: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో అండ్రాయిడ్‌ మొబైల్స్‌ ఉన్నాయి. తల్లిదండ్రులు చదువుకోకున్నా పిల్లలకు ఫోన్‌పై అవగాహన ఉంటుంది. గతంలో రైతులు ఒకేసారి ఎరువులు తీసుకెళ్లడంతో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారు. వారు ఎక్కువ ధరతో విక్రయించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షి: ఎకరాకు ఎన్ని బస్తాలు ఇస్తారు? ఒకేసారి సరిపడా తీసుకోవచ్చా, లేక విడతల వారీగా తీసుకోవాలా..?

డీఏవో: రైతులు ఒకేసారి అవసరమైన ఎరువులు కాకుండా విడతలవారీగా బుక్‌ చేసుకోవాలి. ఐదెకరాల్లో భూమి ఉంటే రెండు విడతలు, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాలి. బుకింగ్‌ యూ ప్‌లో పట్టా పాసుపుస్తకం నంబర్‌ నమోదు చేయగానే లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది. ఏ పంట వేశారనే వివరాలు, ఎంత యూరియా అవసరమనే సమాచారం వస్తుంది. డీలర్‌ షాపును ఎంపిక చేసుకుని కన్ఫమ్‌ చేసుకోవాలి. ఆధీకృత రిటైలర్‌, సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్‌ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ లోగా యూరియా తీసుకోకుంటే తిరిగి అది స్టాక్‌లోకి వెళ్తుంది. జిల్లాలో స్టాక్‌ సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు కూడా సులువుగా తెలుసుకోవచ్చు.

సాక్షి: కౌలు రైతులకు పట్టాలు ఉండవు. వారు యూ రియా తీసుకోవడం ఎలా? అలాగే పట్టా లేని భూములు సాగు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి?

డీఏవో: కౌలుకు తీసుకున్న భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకం వివరాలు నమోదు చేస్తే యజమాని నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వారు ఓటీపీ చెబితే సరిపోతుంది. ఎకరాలకు అనుగుణంగా యూరియా తీసుకోవచ్చు. భూమి ఉండి పట్టాలేని రైతులకు ఇప్పటికై తే అవకాశం లేదు. వ్యవసాయ శాఖ అవకాశం కల్పిస్తే సమాచారం అందిస్తాం.

‘ఫర్టిలైజర్‌’ యాప్‌పై అనుమానాలొద్దు1
1/1

‘ఫర్టిలైజర్‌’ యాప్‌పై అనుమానాలొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement