‘అద్దె’కు స్వస్తి..!
సొంత భవనాల్లోకి ప్రభుత్వ కార్యాలయాలు మార్చాలని ఉత్తర్వులు
ఈ నెల 31లోగా ఖాళీ చేయాల్సిందే..
పక్కా భవనాలు అన్వేషిస్తున్న జిల్లా యంత్రాంగం
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వ కా ర్యాలయాలు ఇక నుంచి సొంత భవనాలు వెతుక్కోవాల్సిందే. ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించడం నిలి పివేయనుంది. కార్యాలయాలు సర్కారు భవనాల్లో నే కొనసాగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికీ పలు కార్యాలయాలకు నేటికీ సొంత భవనాలు లేక అద్దె ప్రాతి పదికన కొనసాగుతున్నాయి. అద్దె చెల్లింపులు భా రంగా మారుతున్న నేపథ్యంలో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రైవేటు భవనాలను ఈ నెలాఖరులోగా ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని నిర్ణయించింది. కొత్త సంవత్సరం ప్రారంభం జనవరి 1వ తేదీ నుంచి అద్దె చెల్లింపులకు నిధులు నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో జిల్లా అధికారులు ప్రభుత్వ భవనాల కోసం అన్వేషణ ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోనూ అద్దెకు..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందే చాలావరకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. నూతన జిల్లా ఏర్పాటు, జిల్లా కేంద్రంగా ఆసిఫాబాద్ మారి న తర్వాత కొన్ని కార్యాలయాలను వాటిల్లోకి మా ర్చారు. సమీకృత కలెక్టరేట్ భవనం కూడా అందుబాటులోకి రావడంతో ప్రసుత్తం చాలా కార్యాలయాలు అందులోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం రాజంపేట గ్రామపంచాయతీ ఏజెన్సీ పరిధిలో అద్దె భవనంలోనే కొనసాగుతుండగా, జన్కాపూర్‌లో బాల్ రక్షభవన్ ఓ ఇంటిలో అద్దె ప్రాతిపదికన కొనసాగుతోంది. చెక్‌పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ సబ్ డివిజ నల్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే ఉంది. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వాటికి ప్రతినెలా సుమారుగా రూ.20వేల వరకు అద్దెను చెల్లిస్తున్నారు. వివిధ మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాలతో భవనాలు అందుబాటులోకి వస్తే అద్దె డబ్బులు ఆదా కానున్నాయి.
అరకొర సౌకర్యాలతో అవస్థలు
కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాల కొరత వేధిస్తోంది. అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉండటంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేక పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయం, సర్‌సిల్క్‌లోని భారీ నీటిపారుదల శాఖ, ఎస్పీఎం క్వార్టర్స్‌లో ఎక్సైజ్ శాఖ కార్యాలయం, తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తుండటంతో అవసరాల నిమిత్తం వచ్చే వారికి అవస్థలు తప్పడం లేదు.


