చోరీలు.. సైబర్‌ మోసాలు! | - | Sakshi
Sakshi News home page

చోరీలు.. సైబర్‌ మోసాలు!

Dec 30 2025 7:45 AM | Updated on Dec 30 2025 7:45 AM

చోరీల

చోరీలు.. సైబర్‌ మోసాలు!

పది హత్యలు, 31 హత్యాయత్నాలు ఈ ఏడాది 1,934 వివిధ కేసులు నమోదు విచ్చలవిడిగా గంజాయి సాగు జిల్లాలో 63 శాతం పెరిగిన క్రైం రేట్‌ వార్షిక నివేదిక విడుదల చేసిన ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌: జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు పెరిగాయి. 2024లో వివిధ కేసులు 1,207 నమోదైతే.. 2025లో ఆ సంఖ్య ఏకంగా 1,934కు చేరుకుంది. హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, చోరీలు, సైబర్‌ మోసాలు కలకలం రేపాయి. 250కి పైగా ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తంగా మారాయి. 38 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌తో కలిసి ఎస్పీ నితిక పంత్‌ వార్షిక నేర గణాంక నివేదిక– 2025 విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. 278 గ్రామ పోలీస్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని, పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, 143 యూనిట్ల రక్తం సేకరించామని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు 2000 పెన్నులు, 1000 ప్యాడ్లు, 120 క్రీడాకిట్లు పంపిణీ చేశామని తెలిపారు.

దొంగతనాల కలవరం

జిల్లాలో దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట చోరీలు చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 50 దొంగతనం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 151 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 300 శాతం కేసులు పెరగడం ప్రజలను కలవరపెడుతోంది. రాత్రిపూట 53 దొంగతనాలు జరిగాయి.

మహిళలపై పెరిగిన నేరాలు

గృహ వేధింపుల కేసులు 106 నమోదు కాగా, గతేడాదితో పోలిస్తే 7.07 శాతం పెరిగాయి. నలుగురు మహిళలు హత్యకు గురయ్యారు. 4 ఆత్మహత్య ప్రేరణ, 22 అత్యాచార, 20 అపహరణ, 52 వేధింపుల కేసులు, మరో 7 కేసులు నమోదయ్యాయి. షీటీంల ద్వారా 202 అవగాహన కార్యక్రమాలు చేపట్టి 63 మంది నేరస్తులను పట్టుకున్నారు. మూడు చిన్న కేసులు, 42 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 18 పోక్సో కేసులు నమోదు చేశారు. కళాబృందాల ద్వారా అవగాహన 900 కార్యక్రమాలు చేపట్టారు.

46 మందికి జైలు శిక్ష

కోర్టులో పోలీసులు సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో పలు కేసుల్లో 46 మందికి శిక్షలు పడ్డాయి. ఆరుగురికి యావజ్జీవ, 14 మందికి 10 నుంచి 20 ఏళ్లు, ఆరుగురికి పదేళ్లు, తొమ్మిది మందికి ఐదేళ్లు, ఇద్దరికి మూడేళ్ల ఏళ్లు, తొమ్మిది మందికి ఏడాదిలోపు జైలు శిక్షలు విధించారు.

37 ‘సైబర్‌’ కేసులు

సైబర్‌ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్ప డుతున్నారు. గతేడాది జిల్లాలో 21 సైబర్‌ నేరాలు జరగగా, ఈ ఏడాది 315 దరఖాస్తులు రాగా, 37 కేసులు నమోదయ్యాయి. వీటిలో రూ.2,07,10,353 నష్టం కాగా, రూ.17,81,490 నగదును ఖాతాల్లో నిలిపివేశారు. రూ.4,78,341 నగదును బాధితులకు అందించారు. కాగజ్‌నగర్‌ పట్టణ పోలీసులు సైబర్‌ క్రైమ్‌ కేసులో మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరుతో ఒక మహిళను మోసం చేసి రూ.76.5 లక్షలు కొల్లగొట్టిన గ్యాంగ్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్టు చేసి, రూ.1.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

అతివేగం, నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో 267 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పోలీసులు 5,488 వాహనాలు తనిఖీ చేసి 3,757 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. రూ.1,04,526 జరిమానా విధించారు. ఆధునిక సాంకేతికతతో 47 కేసుల్లో 10 కేసులు పరిష్కరించారు. మొబైల్‌ చెక్‌ డివైస్‌ ద్వారా 38,855 మందిని తనిఖీ చేశారు. లైవ్‌ స్కానర్‌ ద్వారా 187 నేరగాళ్ల ప్రింట్లు ధ్రువీకరించారు. 126 కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించి 163 లీటర్ల గుడుంబా, లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వివరాలు

నేరాలు 2024 2025

హత్యలు 12 10

హత్యాయత్నాలు 32 31

దోపిడీ 01 01

పగటిపూట ఇళ్ల చోరీలు 01 05

రాత్రిపూట ఇళ్ల చోరీలు 29 53

దొంగతనాలు 50 151

కిడ్నాప్‌లు 18 24

అత్యాచారాలు 24 22

సైబర్‌ నేరాలు 21 37

ఎస్సీ, ఎస్టీ కేసులు 34 38

పోక్సో కేసులు 27 18

గృహ వేధింపులు 99 106

ఇతర కేసులు 536 1095

చేలలో గంజాయి సాగు

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పంట చేలను అడ్డాగా చేసుకుని ఈ ఏడాది గంజాయి సాగు చేశారు. పోలీసులు అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. 73 గంజాయి కేసులు నమోదు కాగా, 122 మంది నిందితులను అరెస్టు చేశారు. 15.224 కిలోల ఎండు గంజాయి, 1,118 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. కెరమెరి, లింగాపూర్‌ మండలాల్లో పత్తి చేలలో గంజాయి సాగును ఏఎస్పీ చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్‌ సహాయంతో గుర్తించారు. రూ.55 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

చోరీలు.. సైబర్‌ మోసాలు!1
1/2

చోరీలు.. సైబర్‌ మోసాలు!

చోరీలు.. సైబర్‌ మోసాలు!2
2/2

చోరీలు.. సైబర్‌ మోసాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement