కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
బెజ్జూర్(సిర్పూర్): రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటి అన్నారు. బెజ్జూర్, బారేగూడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను ఆదివారం పరిశీలించారు. రైతులు సులభంగా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా.. లేదా.. అని ఆరా తీశారు. మార్కెటింగ్ స్థలాన్ని పరిశీలించారు. వర్షం, రద్దీ, ఇతర వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. డీఏవో మాట్లాడుతూ రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రం ఇన్‌చార్జి జె.రంగయ్య, వీవోఏ పి.సంతోష్, ఏపీఎం ఆర్.మోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.


