భరించలేని భారం!
డయాలసిస్ కోసం దూరప్రాంతాలకు వెళ్తున్న బాధితులు అప్పుల పాలవుతున్నా దక్కని ప్రాణాలు కౌటాలలో నూతన కేంద్రం ఏర్పాటుపై సందిగ్ధం ఏడాదిగా పురోగతి లేని వైనం
చింతలమానెపల్లి మండలం లంబాడిహేటి గ్రామానికి చెందిన అజ్మీర గోదానిబాయి ఏడాది క్రితం అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్, కరీంనగర్‌లోని ఆస్పత్రుల్లో చూయించారు. వైద్య పరీక్షల అనంతరం రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వెల్లడైంది. గోదానిబాయి, భర్త మంగీరాంకు నలుగురు ఆడపిల్లలు ఉండగా అందరికీ వివాహాలయ్యాయి. ఏడాది క్రితం కరీంనగర్‌లో వైద్యులు డయాలసిస్ నిర్వహించాలని సూచించారు. కొద్దిరోజులపాటు కరీంనగర్‌కు వెళ్లి డయాలసిస్ చేయించారు. పేదరికంలో ఉన్న వీరికి కరీంనగర్ వెళ్లి డయాలసిస్ నిర్వహించడం భారంగా మారింది. భర్త మంగీరాం మూడు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోగా.. ప్రస్తుతం ఆమె బంధువుల వద్ద ఉంటోంది. సుమారుగా ఆరు నెలలుగా డయాలసిస్ చేయించుకోకపోవడంతో గోదానిబాయి పరిస్థితి విషమంగా మారింది.
చింతలమానెపల్లి(సిర్పూర్): మూత్రపిండాల వైఫ ల్యంతో బాధపడుతున్న వారు డయాలసిస్ చేయించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. స్థానికంగా కేంద్రాలు లేకపోవడం వారికి భారంగా మారింది. ముఖ్యంగా కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాలలకు చెందిన బాధితులు కరీంనగర్, మంచిర్యాలలో అద్దెకు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక భారం, అనారోగ్యంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వీరిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. భూములు, ఇళ్లను అమ్ముకుని అప్పులపాలవుతున్నారు.
దుర్భర జీవితం
మూత్రపిండాలు సరిగా పనిచేయని వారికి రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలు, శరీరంలో అవసరం లేని ద్రవాలను తొలగించడానికి చేసే చికిత్స డయాలసిస్. మూత్రపిండాలు చివరిదశలో ఉన్నప్పుడు.. పూర్తిగా వైఫల్యం చెందినప్పుడు యంత్రాల సాయంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల డయాలసిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే ఏటా కిడ్నీల వైఫల్యంతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లో అనధికార లెక్కల ప్రకారం 40 మందికి పైగా డయాలసిస్ బాధితులు ఉన్నారు. చింతలమానెపల్లి మండలంలోని బాబాపూర్‌కు చెందిన చదువుల రాజేశ్ గతేడాది డయాలసిస్ భారమై మృతి చెందాడు. అదే మండలం రవీంద్రనగర్– 1 గ్రామానికి చెందిన అశోక్ మండల్‌కు కరీంనగర్ వైద్యులు డయాలసిస్ చేయించుకోవాలని సూచించారు. అంతదూరం వెళ్లిరావడం భారంగా మారడంతో చికిత్స అందక మూడు నెలల క్రితం మృతి చెందాడు. అలాగే కాగజ్‌నగర్ కేంద్రంలో డయాలసిస్ కోసం వెయిటింగ్‌లో ఇంకా 20 మంది వరకు ఉన్నారు. బాధితుల్లో ఒకరు మరణిస్తే కానీ మరొకరికి యూనిట్ కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
కొత్త కేంద్రం ప్రారంభం ఊసేది..?
ఆసిఫాబాద్‌లోని జిల్లా ఆస్పత్రితోపాటు కాగజ్‌నగర్ సామాజిక ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో నాలుగు యూనిట్లు, ఆసిఫాబాద్‌లో నాలుగు యూనిట్లు ఉండగా.. ఒక్కో కేంద్రంలో నెలలో 20 నుంచి 25 మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. ఏడాది క్రితం కొత్త కేంద్రాల ఏర్పాటు కోసం జైనూర్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులను అధికారులు పరిశీలించారు. జైనూర్‌లో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నా.. సిర్పూర్(టి)లో మాత్రం పురోగతి లేదు. సిర్పూర్(టి) సీహెచ్‌సీలో వసతులు లేవని సిబ్బంది తెలపడంతో కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు వివరాలు సేకరించారు. కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నిరకాల వసతులు ఉన్నట్లు డీడీవో నవత నివేదిక అందించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కౌటాల పీహెచ్‌సీ పరిధిలోని సుమారు 20మంది డయాలసిస్ బాధితుల వివరాలను సైతం అందించారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన డయాలసిస్ నూతన కేంద్రాలు ప్రారంభించాలని బాధితులు కోరుతున్నారు.
లంబాడిహేటి గ్రామానికి చెందిన జాటోత్ గిరిధర్ కుటుంబానికి ఎకరం భూమి ఉండగా, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కాగా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లారు. కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. మొదట మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో, ఆ తర్వాత ఏడాది నుంచి ఆసిఫాబాద్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెండు రోజులకు ఒకసారి లంబడిహేటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని ఆసిఫాబాద్‌కు వెళ్లిరావాల్సి వస్తోంది. ప్రయాణ భారంతోపాటు ఆర్థికభారంతో రూ.లక్షల్లో అప్పుల పాలయ్యాడు.
నివేదిక అందించాం
కౌటాలలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు గురించి సంబంధిత అధికారులు వివరాలు కోరారు. దీనిపై పీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న సౌకర్యాల నివేదిక అందించాం. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల పరిధిలో ఉన్న బాధితుల వివరాలను సైతం సమర్పించాం.
– నవత, డీడీవో
భరించలేని భారం!


