‘గుర్తింపు’ ఎన్నికలపై నీలినీడలు
హైకోర్టును ఆశ్రయించిన ఎస్పీఎం యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతాయని ఆశించిన కార్మి కులకు నిరాశే మిగులుతోంది. ఎస్పీఎంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మిల్లు యాజమాన్యం మొదటి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే క్రమంలో మరోసారి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది.
అక్టోబర్ 28న సమావేశం
గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్ 28న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది సంఘాలు హాజరయ్యాయి. కానీ ఎస్పీఎం యాజమాన్యం నుంచి ప్రతినిధులె వ్వరూ హాజరు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికా రి ఎస్పీఎం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి ఈ నెల 3లోగా కార్మికుల ఓటరు జాబితాను పంపించాలని చెప్పడంతో అంగీకరించారు. కానీ యాజ మాన్యం కార్మిక శాఖకు ఓటరు జాబితా అందించకుండానే గత నెల 27 తేదీనే కోర్టుకు వెళ్లింది. మిల్లు లీగల్ ఛీప్ మేనేజర్ కేఎన్ శేషగోపాల్ ఎన్నికల నిర్వహణకు ముందుగానే అర్హత కలిగిన సంఘాలను గుర్తించాలని, ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియకు ముందుకెళ్లాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిల్లులోని 15 కార్మిక సంఘాలతోపాటు జాయింట్ కమిషనర్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌ను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
సకాలంలో అందని నోటీసులు
మిల్లు యాజమాన్యం వేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉన్న కార్మిక సంఘాలు ఈ నెల 3న వ్యక్తిగతంగా గానీ, వారి తరఫు న్యాయవాది హైకోర్టులో హాజరుకావాలని నోటీసులను పంపించారు. కానీ ఈ నోటీసులు తెలుగునాడు సిర్పూరు పేపర్‌మిల్స్ కార్మిక పరిషత్(ఈ–734)సంఘానికి మాత్రమే సకాలంలో అందాయి. మిలిగిన సంఘాలకు అందలేదు. విషయం తెలుసుకున్న సీఐటీయూ అనుబంధ సిర్పూర్ పేపరు మిల్స్ మజ్దూర్ యూనియన్(ఈ 3510) హైకోర్టులో వకాలత్ వేసింది. దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. ఆ రోజు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.
ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర
ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్నికలను అడ్డుకోవడం అప్రజాస్వామి కం. మిల్లు యాజమాన్యం వెంటనే పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలి.
– అంబాల ఓదెలు, ఉపాధ్యక్షుడు,
ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్(ఈ–966)
నోటీసులు అందకుండా..
యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేస్తోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన కార్మిక శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఒక్క యూనియన్‌కు కూడా నోటీసులు అందకుండా చేసింది. ఈ నెల 3న హైకోర్టులో హాజరుకాకపోతే యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీంతో తమ యూనియన్ నాయకులు కోర్టులో వకాలత్ వేశారు.
– కూశన రాజన్న, ప్రధాన కార్యదర్శి,
మజ్దూర్ యూనియన్(ఈ–2510)
‘గుర్తింపు’ ఎన్నికలపై నీలినీడలు
‘గుర్తింపు’ ఎన్నికలపై నీలినీడలు


