‘ఉపాధి’ పనులు కల్పించాలని ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. ఉపాధిహామీ కూలీల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి పావని మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారడంతో ఉపాధిహామీ పథకం కింద పనులు చేసే అవకాశం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేస్తేగానీ పూట గడవని తమ కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కూలీలకు చెందిన జాబ్‌కార్డులను రాజంపేట గ్రామ పంచాయతీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ, కూలీలు పాల్గొన్నారు.


