బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Jun 28 2026 12:10 AM | Updated on Jun 28 2026 12:10 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్‌సీఓ సీహెచ్‌.రాంబాబు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హతల ధృవపత్రాల జిరాక్స్‌ ప్రతులు, అనుభవ ధ్రువపత్రాలు, ఇతర పత్రాలతో కూడిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో జూలై 2వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అందించాలని సూచించారు. కాలేజీకి సంబంధించి ఫిజిక్స్‌ నాలుగు పోస్టులు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, గణితం మూడేసి పోస్టులతో పాటు తెలుగు, ఇంగ్లిష్‌, సివిక్స్‌ రెండేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక పాఠశాల స్థాయిలో ఫిజికల్‌ సైన్స్‌ ఐదు, బయోలాజికల్‌ / జనరల్‌ సైన్స్‌, గణితం, ఇంగ్లిష్‌ నాలుగు చొప్పున, తెలుగు రెండు పోస్టులతో పాటు హిందీ, సోషల్‌ స్టడీస్‌ ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని వెల్లడించారు.

పాలేరుకు చేరిన

సాగర్‌ జలాలు

కూసుమంచి: జిల్లాతో పాటు ఇంకొన్ని ప్రాంతాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి గురువారం నీటిని విడుదల చేశారు. ఈమేరకు నీరు పాలేరు రిజర్వాయర్‌కు శనివారం చేరింది. రిజర్వాయర్‌కు ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల మేర చేరుతున్న నీరు క్రమంగా పెరగనుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటిమట్టం 12.80అడుగులకు చేరుకుందని, సాగర్‌ జలాలతో మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా తాగునీటి అవసరాలను తీర్చనున్నట్లు వెల్లడించారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన శ్రీవారికి పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, 29నుంచి ఆలయంలో జరిగే మహా కుంభాభిషేకం కోసం ఈఓ జగన్మోహన్‌రావు కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో

వన మహోత్సవం

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టరేట్‌లో శనివారం వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత వనజీవి రామయ్య సతీమణి జానమ్మ పాల్గొని డీఆర్వో రామ్మూర్తితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని కోరారు. కాగా, కలెక్టరేట్‌ ముందుభాగంలో నాటిన మొక్కలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి సమకూర్చారని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో హార్టికల్చర్‌ అధికారి అనిత, గార్డెన్‌ ఇన్‌చార్జ్‌ హసీనాబేగం తదితరులు పాల్గొన్నారు.

డైట్‌ ప్రిన్సిపాల్‌గా వాసంతి

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వాసంతిని నియమించారు. ప్రిన్సిపాల్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం డీఈఓగా కొనసాగుతున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement