చిత్తడిగా మారిన సభా ప్రాంగణం
రైతు మేళా ఒకే రోజుకు
పరిమితం చేస్తూ నిర్ణయం
చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఆది, సోమవారాల్లో రైతుమేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు నిర్ణయించారు. రెండు రోజుల పాటు జరిగే రైతుమేళాకు 10వేల మంది రైతులను ఆహ్వానించేలా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. మరోపక్క సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అంతరాయం ఏర్పడింది. రైతుమేళా, సభ నిర్వహణకు ఖరారు చేసిన స్థలమంతా పొలాలు కావడంతో వర్షానికి చిత్తడిగా మారింది. దీంతో సామగ్రితో వచ్చిన వాహనాలు మైదానంలోకి వెళ్లేందుకు వీలు పడక మత్కేపల్లి రహదారిపైనే నిలిపేశారు. ఈమేరకు ఒక దశలో సభ వాయిదా పడుతుందని భావించినా అధికారులు శనివారం సాయంత్రం స్పష్టత ఇచ్చారు. రైతుమేళాను ఆదివారం రద్దు చేసి సోమవారం మాత్రమే నిర్వహిస్తామని, మంగళవారం సీఎం పాల్గొనే సభ యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు.
యంత్రాంగమంతా అక్కడే..
రైతుమేళాతో పాటు సీఎం సభ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కమిషనర్ గోపి, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్ శనివారం పరిశీలించారు. రైతుమేళా నిర్వహణకు ఇప్పటికే స్టాళ్లు ఏర్పాటుచేయగా, వివిధ కంపెనీల ప్రతినిధులు సామగ్రిని కూడా తీసుకొచ్చారు. అలాగే, హాజరయ్యే రైతులకు భోజన సదుపాయం కోసం కూరగాయలు, ఇతర సామగ్రి కూడా తెప్పించారు. అయితే, ఆవరణ అంతా వర్షానికి చిత్తడిగా మారడంతో మొరం తెప్పించి చదును చేయించే పనులు మొదలుపెట్టారు. అలాగే, సభా ప్రాంగణం వద్ద పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క హెలీప్యాడ్ పనులకు కూడా అంతరాయం కలిగింది. హెలీప్యాడ్ నిర్మాణానికి కావాల్సిన కాంక్రీట్, రహదారి నిర్మాణానికి కావా ల్సిన సామగ్రి తీసుకెళ్లే వాహనాలు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో అప్పటికప్పుడు మట్టి పోయించి చదును చేయించారు.
ఒకేరోజు రైతుమేళా
ఖమ్మంసహకారనగర్: మత్కేపల్లి క్రాస్ వద్ద రైతుమేళా నిర్వహణకు నిర్ణయించిన స్థలం వర్షానికి చిత్తడిగా మారడం, ఏర్పాట్లలో అవాంతరాలు రావడంతో అధికారులు పరిశీలించారు. ఆతర్వాత ఉన్నతాధికారులతో చర్చించాక ఆది, సోమవారం కాకుండా సోమవారం మాత్రమే రైతు మేళా నిర్వహణకు నిర్ణయించారు. ఇక మంగళవారం రైతు ఆశీర్వాద సభ యథావిదిగా కొనసాగుతుందని కలెక్టర్ శనివారం సాయంత్రం ప్రకటించారు.
రైతుమేళా, సీఎం సభా ఏర్పాట్లలో ఆటంకం


