రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాలేజీలో అభివృద్ధి పనులు, చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన
ఖమ్మంమయూరిసెంంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి దానవాయిగూడెంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, బాలికల జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి, మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడమే కాక అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పనులకు అనుమతి వచ్చినా ఏళ్ల తరబడి పూర్తికాని సందర్భాలు ఉన్నాయని, కానీ ఈ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సొంత పనిగా భావించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి సారించి ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. పాఠశాలలో ఇంకా చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సమర్పించడంతో పాటు 15 రోజుల్లో క్రీడా మైదానం సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చుని గ్రూప్‌ఫొటో దిగారు. ఇక పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం గోళ్లపాడు, తీర్థాల గ్రామాల సమీపాన ఊటవాగు తండా వద్ద ఆకేరుపై రూ.6.75 కోట్లతో నిర్మించే చెక్ డ్యామ్ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఈఈ బషీర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. చింతకాని మండలంలో ఈ నెల 30న జరిగే సీఎం సభ ఏర్పాట్లను ఉదయం పరిశీలిస్తారు. ఆ తర్వాత నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం, రాజారాంపేట, కోరట్లగూడెం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న మంత్రి, అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు.


