బీఎల్‌ఓల యాప్‌లోని మాడ్యూళ్లతో పారదర్శకత సర్వే వివరాలు, మ్యాపింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే..
పీరీల ఊరేగింపులో పాల్గొన్న నగరవాసులు
‘ఎస్‌ఐఆర్’లో భాగంగా ఇంటింటి ఓటర్ల సర్వే చేస్తున్న బీఎల్‌ఓలకు ఎన్నికల సంఘం ప్రత్యేక కిట్లు అందజేసింది. ఈ కిట్లలో క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైన అన్ని రకాల సామగ్రి సమకూర్చారు. ముందస్తుగా ముద్రించిన ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించేందుకు వీలుగా ’ఫారం–6’ అప్లికేషన్లను అందించారు. అలాగే, సిబ్బందిని ప్రజలు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక లోగోతో కూడిన టీ–షర్ట్, టోపీ, గొడుగు అందించడంతో పాటు గుర్తింపు కార్డు కూడా జారీ చేశారు. అలాగే, వాటర్ బాటిల్, పెన్సిళ్లు, పెన్నులు, రైటింగ్ ప్యాడ్ తదితర సామగ్రితో పాటు అవగాహన బుక్‌లెట్లను ప్రత్యేక బ్యాగ్‌లో అందించారు. ఇవికాక వర్షం వచ్చినా ఇబ్బంది రాకుండా రెయిన్ కోట్, ఫోన్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా సమకూర్చారు.
ఖమ్మంమయూరిసెంటర్: పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కొనసాగుతోంది. ఈక్రమాన లోటుపాట్లు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను జోడించింది. ఇందుకోసం ఇంటింటా వివరాలు సేకరించే బూత్ లెవల్ అధికారు(బీఎల్‌ఓ)ల కోసం యాప్‌లోని ‘ఎసినెట్’ అప్లికేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రీ–డ్రాఫ్ట్, పోస్ట్–డ్రాఫ్ట్ మాడ్యూళ్లను చేర్చారు.
అంతా డిజిటలైజేషన్
రాతపూర్వక పద్ధతికి స్వస్తి చెబుతూ, ప్రతీ ఓటరు వివరాల పరిశీలన, మ్యాపింగ్‌ను ఆన్‌లైన్ చేశారు. ఇందుకోసం తెలుగుతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లో యాప్‌ను రూపొందించారు. ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలకు ముందే బీఎల్‌ఓలు యాప్ ద్వారా కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. బూత్ పరిధిలోని మొత్తం ఓటర్లు, అందులో ఎందరికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని మిగిలాయో నమోదు చేయాలి. ఇవికాక ఎందరు ఓటర్లు ఆన్‌లైన్‌లో ఫారాలు పూరించారనే వివరాలను కూడా బీఎల్‌ఓలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రస్తుత జాబితాలోని ఓటర్ల వివరాలను, గత జాబి తాల్లోని డేటాతో అనుసంధానం చేసే వీలు ఏర్పడింది. గత ఓటర్ల వారసులను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించి అనుసంధానం చేయొచ్చు.
వారు.. ప్రత్యేకం
బీఎల్‌ఓలు ఓటరు ఇంటికి ఓసారి వెళ్లినప్పుడు లేకపోతే మరో రెండు సార్లు వెళ్లాలి. అయినప్పటికీ అందుబాటులో లేకపోయినా, ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, ఫారంపై సంతకం చేయడానికి నిరాకరించినా ప్రత్యేకంగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించి వివరాలను 150 అక్షరాల్లో రాసి, ఫారంను యాప్‌లో అప్‌లోడ్ చేసి ‘మార్క్ అన్‌కలెక్టబుల్’గా నమోదు చేయాల్సి ఉంటుంది.
పొరపాట్లు జరగకుండా..
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు చేర్చారు. ఓటరు పేరు, బంధుత్వాల పేర్లలో తప్పులు ఉంటే (గత ఓటర్ లిస్ట్‌తో తండ్రి పేరు సరిపోకపోతే) యాప్ చూపిస్తుంది. దీంతో ఆధారాలను బీఎల్‌ఓలు అప్‌లోడ్ చేయడమేకాక, అభ్యంతరాలపై విచారణ నోటీసులకు ఇచ్చిన రశీదులను కూడా నమోదు చేయాలి. విచారణ సమయాన గ్రూప్ ఫొటో, అటెండెన్స్ షీట్‌ను సైతం లైవ్‌లో అప్‌లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులోని పాత ఫొటో స్పష్టంగా లేకపోతే, కొత్త ఫొటోను యాప్ ద్వారా పరిశీలించి అప్‌డేట్ చేయొచ్చు. ఇక 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అనుమానాస్పద ఇళ్లల్లో లేని, ఇళ్లు మారిన, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పక్కాగా నిర్ధారించుకునే సదుపాయం బీఎల్‌ఓలకు యాప్ ద్వారా కల్పించారు.
ఒకే క్లిక్‌తో అధికారుల డైరెక్టరీ
క్షేత్రస్థాయిలో తిరిగే బీఎల్‌ఓలకు ఎలాంటి అత్యవసర సాయం కావాలన్నా.. ఉన్నతాధికారులను సంప్రదించాలన్నా ‘ఎసినెట్’ యాప్‌లోనే ప్రత్యేక కాంటాక్ట్ డైరెక్టరీని పొందుపరిచారు. ఇందులో ద్వారా సీఈఓ, డీఈఓ, ఈఆర్‌ఓ, ఆర్‌ఓ, ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలతో బీఎల్‌ఓలు చేపట్టే ప్రక్రియలు సులభంగా మారాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఓటర్ల జాబితా సవరణలో కీలకంగా యాప్


