ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–30 గంటల నుంచి కూసుమంచి మండలం దుబ్బతండా, లాల్‌సింగ్ తండా, మధ్యాహ్నం 12–20 గంటలకు జీళ్లచెర్వుల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం 4–45 గంటలకు ఖమ్మం దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అభివృద్ధి పనులకు, ఉత్తవాగు తండాలో ఆకేరుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
కొనసాగుతున్న
ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్న 650మంది విద్యార్థులకు గాను 630మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. వచ్చే సోమవారం వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆయన వెల్లడించారు.
29నుంచి జమలాపురంలో మహా కుంభాభిషేకం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహా కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి, ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు కోరారు. తెలిపారు. ఆలయంలో శుక్రవారం వారు ఏర్పాట్లపై పోలీసు, ఇతర శాఖల అదికారులతో సమీక్షించారు. తొలిరోజైన 29న ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, 2వ తేదీన అలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లు, శ్రీసోమేశ్వరస్వామి ఆలయ జీవ ధ్వజ స్తంభాల ప్రతిష్ఠ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక 3వ తేదీన శ్రీశృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి చేతుల మీదుగా మహా కుంభాభిషేక సంప్రోక్షణ ఉంటుందని తెలిపారు. వేలాదిగా హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈసమావేశంలో సర్పంచ్ తుళ్లూరు నిర్మల, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన
‘కనకతార’
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ప్రదర్శించిన ‘కనకతార’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు బాల్య వివాహాలు, కన్యాశుల్కం, సీ్త్రల అణచివేత తదితర అంశాల ఆధారంగా రచించిన ఈ నాటికను సురభి భానోదయ నాట్యమండలి కళాకారులు ప్రదర్శించారు. కనకతార తండ్రి డబ్బు ఆశతో వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం, తదితర అంశాలతో రూపొందించిన ఈ నాటికను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. చందాల కేశదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో నాటికను ప్రదర్శించగా, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు తిరుమలరావు, కళాకారులు దయానంద భూషణం, రామాల ప్రకాష్, గులాం దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


