రేపటి నుంచి రైతుమేళా | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి రైతుమేళా

Jun 27 2026 12:07 AM | Updated on Jun 27 2026 12:07 AM

● మత్కేపల్లిలో 28, 29వ తేదీల్లో నిర్వహణ ● 150 స్టాళ్లు, రోజుకు 5వేల మంది రైతులకు ఆహ్వానం

● మత్కేపల్లిలో 28, 29వ తేదీల్లో నిర్వహణ ● 150 స్టాళ్లు, రోజుకు 5వేల మంది రైతులకు ఆహ్వానం

చింతకాని/ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద ఈనెల 28, 29వ తేదీల్లో మెగా రైతుమేళా నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ ప్రాంతానికి పక్కనే 30వ తేదీన జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన రైతు మేళా నిర్వహణకు నిర్ణయించారు. వ్యవసాయంలో ఆధునికత, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించేలా ఈ మేళాను నిర్వహిస్తారు.

ప్రదర్శనలు, అవగాహన

వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన పరికరాలు, విత్తనాల ప్రదర్శన కోసం ఐదెకరాల స్థలంలో 150 స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. రోజుకు 5వేల మంది చొప్పున 10 వేల మంది రైతులను ఆహ్వానించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులతో ప్రదర్శనలు ఇప్పిస్తారు. విత్తనాభివృద్ధి సంస్థ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఆయిల్‌పామ్‌, విజయ డెయిరీ, విద్యుత్‌ శాఖ, రెడ్‌–కో, బ్యాంకులు, ఫెర్టిలైజర్లు, విత్తన కంపెనీలు, సేంద్రియ ఉత్పత్తులు, యంత్ర పరికరాల ప్రదర్శన ఉంటుంది. అలాగే, వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని ప్రస్తుత వాతావరణం, ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం స్టాళ్లు ఏర్పాటుచేస్తున్న ఆవరణలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా, రెండు రోజుల పాటు మేళాకు 10వేల మంది రైతులు హాజరుకానుండగా, వీరికి రవాణా సౌకర్యం కల్పించడమే కాక అల్పాహారం, భోజనం సైతం సమకూరుస్తారు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, కమిషనర్‌ డాక్టర్‌ గోపి శనివారమే జిల్లాకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

మత్కేపల్లి క్రాస్‌ వద్ద రెండు రోజుల పాటు జరిగే రైతుమేళాను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రైతుమేళాలో ఏర్పాటుచేస్తున్న స్టాళ్లతో పాటు 30వ తేదీన జరిగే సీఎం సభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. స్టాళ్లు, ప్రధాన వేదిక, భోజనశాలలు, పార్కింగ్‌ స్థలాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, తాగునీటి వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు మేళాలో 150కు పైగా వివిధ శాఖల ఆధ్వర్యాన అవగాహన కల్పించేందుకు స్టాళ్లు ఏర్పాట్లు చేస్తుండగా, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళాకు వచ్చే రైతులకు ఇబ్బంది రాకుండా తాగునీరు, వైద్య సదుపాయం, భోజన వసతితో పాటు సమాచార కేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తొలిరోజైన 28వ తేదీన రైతుమేళాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement