వేంసూరు: రైతులు సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే స్థిరమైన ఆదాయం వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేంసూరు మండలం కల్లురుగూడెంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అయిల్‌పామ్ టన్నుకు రూ.25 వేల ధర నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఆయిల్‌పామ్ సాగులో అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యాన ప్రతీ జిల్లాలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే రైతులకు రవాణా వ్యయం తగ్గడమే కాక స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, కాసరి చంద్రశేఖర్‌రెడ్డి, వెల్ది జగన్‌మోహన్‌రావు, తుమ్మూరు లక్ష్మారెడ్డి, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, ఫైజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరుగూడెంలో పరిశీలించిన మంత్రి తుమ్మల


