ఖమ్మం క్రైం: మాదకద్రవ్యాలను సమాజం నుంచి సమూలంగా నిర్మూలించే బాధ్యత అందరూ స్వీకరించాలని కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమతా రోడ్డు నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసు కమిషనర్ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ప్రారంభించాక కలెక్టర్ మాట్లాడారు. దేశ నిర్మాణంలో కీలకమైన యువత దురలవాట్లకు లోను కాకుండా భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతీఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని తెలి పారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం యువతతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంత రం ‘ఐయామ్ యాంటీ డ్రగ్ సోల్జర్’ సైన్ బోర్డుపై సంతకాలు చేశారు. ఏసీపీలు రమణమూర్తి, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీలో కలెక్టర్, సీపీ


