ఎలా చేసుకోవాలంటే..
● ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫామ్ నింపే అవకాశం ● ఇంట్లో కూర్చునే సులువుగా వివరాల ఽధ్రువీకరణ ● ఓటరు జాబితా, ఆధార్ కార్డులో పేర్లు సరిపోతే చాలు..
ఖమ్మం మయూరిసెంటర్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(ఎస్‌ఐఆర్)పై చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మొదలైంది. ఓటర్ల జాబితాలో పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఓటర్లు తమ వివరాలను ఽధ్రువీకరించుకోవడానికి బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌ఓ) కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం కల్పించిన వెసలుబాటు ఆధారంగా ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేయొచ్చు. సులభంగా, అత్యంత సురక్షితంగా, వేగంగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముండడంతో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఆధార్ ఈ–సైన్
వివరాలన్నీ సరిగ్గా పూరించాక, సిస్టమ్ మిమ్మల్ని ఈ–సైన్ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీ ద్వారా ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. ప్రక్రియ పూర్తయ్యాక మీ ఫామ్ విజయవంతంగా అప్‌లోడ్ అయినట్లు మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
ఎవరు ఉపయోగించుకోవచ్చు?
ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులోని పేరు కచ్చితంగా సరిపోలిన ఓటర్లందరూ ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటర్లకు తమ ఓటర్ ఐడీ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఒకవేళ మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోతే మొదటగా అదే పోర్టల్‌లో ‘ఫారం–8’పూరించి మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్ వీలుకాని పక్షంలో బూత్ లెవల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఫామ్‌లు అందజేస్తారు. అయితే ఆన్‌లైన్ విధానం అత్యంత సులభమైనది, గోప్యతతో కూడినది కావడంతో ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఓటర్లకు అవగాహన
ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియపై అధికారులు ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ ఓటర్‌కు రెండేసి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడంతో పాటు వాటిని నింపే విధానాన్ని వివరిస్తున్నారు. రెండు ఫారాలతో పాటు నమూనా పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫామ్ నింపడానికి ఉన్న అవకాశాన్ని కూడా తెలియజేస్తున్నారు.
ఓటర్లు తొలుత భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in లోకి వెళ్లాలి. అక్కడ ఓటర్ ఐడీ నంబర్ / రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో "Fill Enumeration Form' ను ఎంచుకోవాలి. వెబ్‌పేజీలో మీ పాత రికార్డులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అవి సరిపోల్చుకుంటూ అడిగిన అవసరమైన తాజా సమాచారాన్ని నమోదు చేయాలి.


