ఖమ్మం రాపర్తినగర్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీన హనుమకొండ జిల్లాలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వివిధ కంపెనీల బాధ్యులు పాల్గొని సుమారు 5వేల మందికి నియామక పత్రాలు ఇచ్చే అవకాశముందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని కిట్స్ కళాశాలలో జరిగే జాబ్‌మేళాకు ఇంటర్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు హాజరుకావొచ్చని తెలిపారు.
గైనకాలజిస్టుల నియామకానికి 1న ఇంటర్వ్యూలు
ఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని మధిర ఏరియా ఆస్పత్రి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్టుల నియామకానికి జూలై 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్) కె.రాజశేఖర్ గౌడ్ తెలిపారు. అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించే ఉద్దేశంతో జూలై, ఆగస్టు నెలలకు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మధిర ఆస్పత్రి, కల్లూరు సీహెచ్‌సీలో ఒక్కో గైనకాలజిస్టును నియమించనుండగా ఎంబీబీఎస్‌తో పాటు ఎంఎస్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అదనపు అర్హతలు, పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీహెచ్‌ఎస్ ఓ ప్రకటనలో సూచించారు.
‘పల్స్ పోలియో’కు
సిద్ధం కావాలి
చింతకాని: చిన్నారులు పోలియో బారిన పడకుండా కాపాడేలా ఈనెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు ఉద్యోగులు సిద్ధం కావాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు సూచించారు. చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 0–5 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ చుక్కల మందు వేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఆతర్వాత బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వ్యాక్సిన్ల నిల్వలపై సమీక్షించారు. అంతేకాక ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, ఫార్మసీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ వైద్యసేవలపై సూచనలు చేశారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వైద్యులు శ్రీదేవి, సోహైల్, ఉద్యోగులు ఇస్మాయిల్, కనకతార, సిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
క్లినికల్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ–ఫీమేల్) ఒకేషనల్ కోర్సులో మార్చి 2022 నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఏడాది పాటు జిల్లా ఆస్పత్రిలో క్లినికల్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. శిక్షణకు ఎంపికై న వారు రూ.వేయి డీడీ ఆస్పత్రి పేరిట సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్, బయోడేటా ఫారం, సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో కూడిన దరఖాస్తును కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జూలై 10 లోగా అందజేయాలని డీఐఈఓ ఓ ప్రకటనలో సూచించారు.


