ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాకు తలమానికంగా నిలిచే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.18 వేల కోట్ల అంచనా వ్యయం ఇప్పుడు రూ.19 వేల కోట్లకు చేరగా, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.360 కోట్లే కేటాయించిందని మండిపడ్డారు. జిల్లా నుంచే ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు ఉన్నా ప్రాజెక్టుకు నిధులు రాబట్టలేకపోతున్నారని తెలిపారు. ఇదికాక మంత్రులు రాజీవ్ కెనాల్, జవహర్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ అంటూ తలా ఒక కాల్వపై దృష్టి సారించగా, ప్రధాన ప్రాజెక్టే పూర్తి కానప్పుడు కాల్వలతో రైతులకు ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో తాము చేసిన సుదీర్ఘ పోరాటాలతోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే 104 కి.మీ. పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన రెండు టన్నెళ్ల పనులను పూర్తి చేసి గోదావరి నీళ్లను పాలేరుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2026 ఆగస్టు 15నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని వైరా సభలో చెప్పారని, ఇప్పుడు మరోమారు వస్తున్న సీఎం ఎందుకు పూర్తికాలేదో చెప్పాలని సూచించారు. అంతేకాక ఆశీర్వాద సభ పేరిట నిర్వహించే సమావేశంలో జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని సుదర్శన్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. చింతకాని మండలంలో సీపీఎం నేత రామారావు హత్య జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా నిందితులెవరో తేల్చకపోగా, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర ఇంట్లో రూ.25 లక్షల చోరీ కేసులోనూ పురోగతి లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు వై.విక్రమ్, కళ్యాణం వెంకటేవ్వరరావు, యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
సుదర్శన్‌రావు


