ఆగస్టు కల్లా టన్నెల్‌ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు కల్లా టన్నెల్‌ పూర్తి చేయండి

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

సత్తుపల్లిటౌన్‌: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్‌ నిర్మాణ పనులను ఆగస్టు మొదటి వారం నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీ.ఎస్‌., అంకిత్‌ ఆదేశించారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టన్నెల్‌ పనులను గురువారం పరిశీలించారు. పనుల పురోగతి, లైనింగ్‌ నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలించాక వారు ఇరిగేషన్‌ శాఖ టన్నెల్‌ అండ్‌ సేఫ్టీ కార్యదర్శి కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, సీఈ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ యాతాలకుంట టన్నెల్‌ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే, సత్తుపల్లి ట్రంక్‌ కాలువకు గోదావరి జలాలు చేరి సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఈమేరకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భద్రాద్రి కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ టన్నెల్‌ నిర్మాణ పనులు, నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించడమే కాక నిర్మాణం పూర్తయ్యాక నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ బి.కృష్ణ, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర, అంకిత్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement