ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాభవాని, నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడి కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా బడ్జెట్ పెంచడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానం, నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలు తెరవాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆతర్వాత వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షమీ, కోశాధికారి వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులు, నాయకులు ఉద్దండు షరీఫ్, విజయ్ కుమార్, రమణ, శ్రీనివాసరావు, వీరయ్య, గురవయ్య, లక్ష్మీకుమారి, హైమారాణి, మంగీలాల్, కృష్ణారావు, వీరాస్వామి, ప్రసాదరావు, భాస్కర్, జేవీ., రంగారావు, బాబు, బండి నరసింహారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన నిరసన


