సభకు సమీకరణ! | - | Sakshi
Sakshi News home page

సభకు సమీకరణ!

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

జోరుగా ఏర్పాట్లు

30న బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఇక్కడి నుంచే ‘రైతు భరోసా’

నిధుల విడుదల

30 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు, 2లక్షల మందిని సమీకరించేలా ప్రణాళిక

ఇప్పటికే జోరందుకున్న ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద ఈనెల 30న నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. సభతో పాటు రైతుమేళా నిర్వహణకు సుమారు 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభావేదిక పైనుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సీఎం ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనుండడం, 2లక్షల మంది జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే 28, 29వ తేదీల్లో రైతుమేళా నిర్వహించనుండగా ఏర్పాట్లను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. పరిశీలించారు.

రైతు మేళా.. ఆపై సభ

మత్కేపల్లి క్రాస్‌ వద్ద ఈనెల 30న నిర్వహించే సభకు ‘రైతు ఆశీర్వాద సభ’గా నామకరణం చేశారు. తొలుత 28, 29వ తేదీల్లో సభా ప్రాంగణంలో రైతుమేళా నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 30 ఎకరాల స్థలంలో ఐదు ఎకరాలను స్టాళ్ల ఏర్పాటుకు కేటాయించారు. మరో ఐదు ఎకరాలు సీఎం కాన్వాయ్‌, ఫ్లయింగ్‌ జోన్‌కు కేటాయించారు. మిగిలిన 20 ఎకరాల్లో సభావేదిక ఇతర ఏర్పాట్లు చేస్తారు. కాగా, సభా వేదిక వద్దే కాక కలెక్టరేట్‌ వద్ద రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు.

జన సమీకరణకు ప్రణాళిక

సీఎం హాజరయ్యే సభకు జనాన్ని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యాన సభ జరగనున్నా, జన సమీకరణ బాధ్యత మాత్రం కాంగ్రెస్‌, అనుబంధ సంఘాలు భుజాలపై వేసుకున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి లక్ష మంది, వైరా నుంచి 50 వేల మందితో పాటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి మరో 50 వేల మందిని సమీకరించేలా దృష్టి సారించారు. ఇందుకోసం 3,500 బస్సులు సమకూర్చాలని ఆర్టీసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇవి కాక ప్రైవేట్‌ వాహనాలు కూడా రానుండగా, వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా 150 ఎకరాలను కేటాయించారు.

ప్రత్యేక దృష్టి

రైతు ఆశీర్వాద సభ విజయవంతంపై మంత్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏర్పాట్లపై పలుమార్లు అధికారులకు సూచనలు చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్‌రెడ్డి మొదటిసారి మధిర నియోజకవర్గానికి వస్తుండడంతో భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు.

వైరాలో రుణమాఫీ, మధిరలో రైతు భరోసా

చింతకానిలో జరిగే సభావేదిక పైనుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ‘రైతుభరోసా’ నిధులను సీఎం విడుదల చేయనున్నారు. మొత్తం రూ.9వేల కోట్ల నిధులు విడుదల కానున్నాయి. గతంలో వైరా నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రూ.21వేల కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుభరోసా నిధుల విడుదలకు జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎంపిక చేసిన స్థలంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సభ నిర్వహించే 30 ఎకరాలతోపాటు మరో 150 ఎకరాల భూమిని కూడా డోజర్లు, రోలర్లతో చదును చేయిస్తున్నారు. రైతుమేళా ప్రారంభానికి రెండు రోజుల సమయమే ఉండడంతో వేదికలకు కావాల్సిన సామగ్రి తరలిస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసే స్టాళ్లలో వ్యవసాయ పనిముట్లు, వివిధ రకాల విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రదర్శిస్తారు.

ఈనెల 28, 29వ తేదీల్లో

చింతకాని మండలంలో రైతు మేళా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement