బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి నాగరాజు | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి నాగరాజు

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

ఖమ్మం, లీగల్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎం.నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా జడ్జిగా ఉన్న జి.రాజగోపాల్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో వికారాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు నియమితులయ్యారు. ఈమేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర, నాణ్యమైన న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్లపల్లి రమేష్‌ కొప్పుల రవితో పాటు పలువురు న్యాయవాదులు జిల్లా జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మాదక ద్రవ్యాలతో

దుష్పరిణామాలు

ఖమ్మంరూరల్‌/ఖమ్మంలీగల్‌: మాదక ద్రవ్యా ల వినియోగంతో రుగ్మతలు ఎదురుకావడమే కాక శారీకర, సామాజిక దుష్పరిణామాలు వస్తాయని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, అర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ తెలిపారు. ఈమేరకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యాన గురువారం జిల్లా కారాగారంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ, సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం జైలు ఉద్యోగులు, ఖైదీలతో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, జైలర్‌ సక్రూ, డిప్యూటీ జైలర్‌ హనుమంతరావు, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ కండె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వీధి వ్యాపారులకు

గుర్తింపు కార్డులు, రుణాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో కొత్తగా గుర్తించిన వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యాన గుర్తింపు కార్డులు జారీ చేయడమే కాక పీఎం స్వనిధి రుణాలను మంజూరు చేశారు. ఖమ్మంలోని జెడ్పీ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఎంసీ, మెప్మా, లీడ్‌ బ్యాంక్‌, ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పాల్గొని వీధి వ్యాపారులకు కార్డులు అందజేశారు. జిల్లాలో కొత్తగా 1,100 మందిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. పీఎం స్వనిధి పథకం ద్వారా మొదటి, రెండు, మూడో విడత రుణాలను అర్హులందరికీ అందజేస్తున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక గతంలో రుణాలు పొంది డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వ్యాపారాలు చేస్తున్న పది మంది వ్యాపారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ ఎస్‌.సుజాత, ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, టీఎంసీ జి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

ఖమ్మంసహకారనగర్‌: ఎస్సెస్సీ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. జిల్లా నుంచి 956 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 833 మంది(87.13 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 536 మంది, బాలికలు 297 మంది ఉన్నారు. ఎవరైనా రీ వెరిఫికేషన్‌ చేయించుకోవాలంటే వచ్చేనెల 5వ తేదీలోపు పాఠశాల ద్వారా ఆన్‌లైన్‌లో రూ.వేయి, రీ కౌంటింగ్‌ కోసం పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించాలని డీఈఓ సదానందం సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement