పంటల సాగులో ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో ప్రథమ స్థానం

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

● చింతకాని సభలో రైతుభరోసా, మొక్కజొన్న రైతులకు నిధుల విడుదల ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

● చింతకాని సభలో రైతుభరోసా, మొక్కజొన్న రైతులకు నిధుల విడుదల ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చింతకాని: దేశంలో అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానాన నిలిచిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2.83 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద ఈనెల 30న జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి గురువారం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., సీపీ సునీల్‌దత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరా నియోజకవర్గ కేంద్రంగా రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేయగా, ఇప్పుడు మధిర నియోజకవర్గం చింతకాని సభలో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు. అంతేకాక మొక్కజొన్న అమ్మిన రైతులకు కూడా ఇదే వేదికపై నగదు జమ చేస్తామని వెల్లడించారు. ఈ సభ ఆవరణలో 28, 29వ తేదీల్లో 150 స్టాళ్లతో రైతు ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేస్తుండగా, పనిముట్లు, విత్తనాలు, ఎరువులను సమకూర్చి రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు నివృత్తి చేస్తారని తెలిపారు.

త్వరలోనే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు

పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించటంతో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగైందని, దీన్ని 10లక్షల ఎకరాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల చెప్పారు. త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పామాయిల్‌ ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణ పరిస్థితులు గందరగోళంగా ఉన్నందున రైతులు ఏడు రకాల వరితో పాటు పప్పు దినుసులను సాగు చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో యూరియా ఆధారంగా పరిశ్రమలు నడిపే కొందరు రైతుల పేరిట కొనుగోలు చేస్తుండగా, ఇంకొందరు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని చెప్పారు. మరికొందరు రైతులు గత సీజన్‌లోనే యూరియా నిల్వ చేసుకున్నారన్నారు. ఈమేరకు యూరియా యాప్‌ ద్వారా విక్రయిస్తుండగా, ఈ విధానాన్ని కేంద్రప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా, జిల్లా సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలిచే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్‌ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, అంబటి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, కన్నెబోయిన గోపి, కంచం ద్రౌపతి, తాళ్లూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement