● సాగర్ ఇన్‌ఫాల్ గేట్ల తొలగింపు ● ఒకటి మరమ్మతు, ఇంకొకటి కొత్తది ఏర్పాటు
కూసుమంచి: సాగర్ డ్యామ్ నుంచి ఎడమ కాల్వ ద్వారా మండలంలోని పాలేరు రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరే మార్గంలో నాయకన్‌గూడెం వద్ద ఉన్న ఇన్‌ఫాల్ కాల్వ గేట్ల మరమ్మతుకు మోక్షం లభించింది. ఈ కాల్వ వద్ద 1969లో రెండు గేట్లను అమర్చారు. ఆతర్వాత అప్పుడప్పుడు చిన్నచిన్న మరమ్మతులు తప్ప ఇతర పనులు చేపట్టలేదు. కాలక్రమంలో వీటి నిర్వహణలో ఇబ్బంది వస్తుండడంతో, నీరు విడుదలైనప్పుడు అవాంతరం ఎదురైతే పెనుప్రమాదం జరిగే అవకాశముంది. ఈనేపథ్యాన ఒక గేటుకు మరమ్మతు చేయాలని, ఇంకో గేట్ స్థానంలో కొత్తది అమర్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇన్‌ఫాల్ కాల్వ గేట్లను గురువారం అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల ద్వారా వీటిని తొలగించే క్రమాన ఖమ్మం – సూర్యాపేట పాత రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ఈఈ అనన్య పర్యవేక్షణలో ఏఈ శ్రీరాం ఆధ్వర్యాన గేట్ల తొలగింపు చేపట్టగా, త్వరలోనే ఒకటి కొత్తది అమర్చడమే కాక మరొకటి మరమ్మతు చేయించి బిగిస్తామని తెలిపారు.


