‘సీతారామ’ను పక్కన పెట్టారు.. | - | Sakshi
Sakshi News home page

‘సీతారామ’ను పక్కన పెట్టారు..

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

మొక్కజొన్న, ధాన్యం కూడా కొనడం లేదు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభం ? వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలవాలి బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్‌రావు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం వైరారోడ్‌: ‘రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 2.60 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కానీ మక్కలతో పాటు ధాన్యం కొనే దిక్కు లేదు. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి ఏం లాభం... రైతుల ఉసురు తీస్తారా?’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. అంతేకాక ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పక్కన పెట్టిందన్నారు. కొద్ది ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇదే వేదికపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు మాట్లాడుతూ మక్కలు, వడ్ల కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు దాష్టీకాలకు పాల్పడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నాడు కేసీఆర్‌ హయాంలోనే ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు వంద పడకల ఆస్పత్రులు మంజూరయ్యాయని వెల్లడించిన హరీష్‌రావు, ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరూ చెరిపి వేయలేరని చెప్పారు. ఆయన ప్రేమను అందుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇవ్వాలని పిలుపునిచ్చారు.

తుది శ్వాస వరకు కేసీఆర్‌ వెంటే.. : పువ్వాడ

తుది శ్వాస వరకు తన రాజకీయ ప్రయాణం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కోసమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకు తెలంగాణ సెంటిమెంట్‌ లేదనే ప్రచారంలో నిజం లేదన్నారు. తొలిదశ ఉద్యమకారుడు అన్నబత్తుల రవీంద్రనాథ్‌ నుంచి మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన కేసీఆర్‌ ‘ఖమ్మం దీక్ష’ వరకు ఈ ప్రాంత పాత్ర మరువలేనిదని తెలిపారు. కేసీఆర్‌ అండతో ఎదిగి పదవులు అనుభవించి, నేడు అధికారం కోసం పార్టీలు మారిన నాయకులు ఇప్పుడు కేటీఆర్‌, హరీష్‌రావును విమర్శించడం గర్హనీమన్నారు. తప్పుడు కేసులకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, మరో రెండున్నర ఏళ్లలో మళ్లీ కేసీఆర్‌ పాలన వస్తుందని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కొట్లాడడానికి పూర్తి శక్తితో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనిచ్చేది లేదని చెప్పిన వారిని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే గేటు తాకకుండా చేస్తారని వెల్లడించారు.

గులాబీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ రవిచంద్ర

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి పదికి పది నియోజకవర్గాలను గెలిపించి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, గట్టు రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కురాకుల నాగభూషణంతో పాటు గుండాల కృష్ణ, దిండిగాల రాజేందర్‌, పగడాల నాగరాజు, వనమా రాఘవ, కర్నాటి కృష్ణ, మగ్బూల్‌, మెంతుల శ్రీశైలం, బత్తుల మురళి, భూక్యా దళ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement