2వేల మందికి పైగా
ఉద్యోగులు
జిల్లాలో జనగణన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. సర్వే పారదర్శకంగా నిర్వహించేలా ఎన్యుమరేటర్లు, వారికి మార్గనిర్దేశం కోసం సూపర్‌వైజర్లను నియమించారు. అంతేకాక ఎన్యుమరేటర్ల వివరాలను సీఎంఎంఎస్(సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టర్‌లో నమోదు చేస్తున్నారు. అలాగే, హౌస్ లిస్టింగ్ బ్లాక్, ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొదటి దశ సర్వే ప్రక్రియ వచ్చేనెల 10 లేదా 11వ తేదీన ప్రారంభం కానుంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
● పూర్తయిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం ● చివరి దశకు చేరిన బ్లాక్‌ల గుర్తింపు ● వచ్చే నెల నుంచి మొదటి దశ సర్వే
హౌస్ లిస్టింగ్ బ్లాక్ సర్వేలో భాగంగా
ఖమ్మం 50వ డివిజన్‌లో వివరాలు
తెలుసుకుంటున్న ఉద్యోగులు
రెండు దశల్లో గణన..
జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశ ఈ ఏడాది మే నెలలో, రెండో దశ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. తొలి దశలో భాగంగా గృహగణన చేపడతారు. ఒక ప్రాంతంలోని నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలు సేకరించి నంబర్లు కేటాయించి జాబితా రూపొందిస్తారు. అలాగే, ఎన్యుమరేషన్ బ్లాక్‌లు(జనాభా గణన బ్లాక్‌లు) కూడా ఏర్పాటు చేస్తారు. పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్న భౌగోళిక ప్రాంతాలు(బ్లాక్)లుగా విభజించి ప్రతీ బ్లాక్‌కు ఒక అధికారిని కేటాయించి ప్రతీ ఇంటి వివరాలు సేకరిస్తారు. ఇది పూర్తయితే జనగణనలో భాగమైన ప్రాథమిక దశ ముగిసినట్లవుతుంది.
పొరపాట్లకు తావులేకుండా..
జనగణనలో పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల కోసం మ్యాపింగ్ చేపట్టారు. ప్రతీ 800మంది జనాభా లేదా 300 – 350 ఇళ్లను ఒక ఎన్యుమరేషన్ బ్లాక్‌గా పరిగణిస్తారు. ఈ మ్యాపింగ్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తి కాగా.. జిల్లాలోని ఇంకొన్ని చోట్ల చివరి దశలో ఉంది. ఇందులో పొరపాట్లు దొర్లితే సరిచేసేందుకు ఉద్యోగులు మరోమారు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇళ్లు, జనాభాలో హెచ్చుతగ్గులు వస్తే సరిచేశాక సీఎంఎంఎస్ పోర్టర్‌లో నమోదు చేస్తారు. గ్రామ స్థాయిలో ల్యాండ్‌మార్క్‌లు, పాఠశాలలు, ఆలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలను బ్లాక్ వారీగా నమోదు చేయాల్సి ఉంటుంది. జనగణన సులువుగా జరిగేందుకు హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లు కీలకం కానున్నందున అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రతీ బ్లాక్‌కు ఎన్యుమరేటర్
ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం, శిక్షణ, హౌస్ లిస్టింగ్, ఎన్యుమరేషన్ బ్లాక్‌ల గుర్తింపు పూర్తయ్యాక హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల్లో మ్యాపింగ్ జరుగుతోంది. ఆపై యాప్‌లో నమోదు చేశాక వచ్చేనెలలో ఎన్యూమరేటర్లు సర్వే ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రతీ బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటర్‌ను కేటాయించనుండగా, వీరు ఇంటింటికీ వెళ్లి 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ఆధారంగా వివరాలు సేకరిస్తారు.
జనగణన కోసం జిల్లాలో పది శాతం రిజర్వ్ కలిపి 2,091 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. అలాగే, ప్రతీ ఆరుగురు ఎన్యూమరేటర్లపై పర్యవేక్షణకు ఒక సూపర్‌వైజర్ చొప్పున 390 మందిని ఏర్పాటు చేశారు. వీరికి సర్వేపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే, సర్వే ప్రారంభానికి ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది.


