నేలకొండపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించనున్నారు. కూసుమంచి మండలం వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్లు, చేగొమ్మలో సొసైటీ గోదాంను మంత్రి ప్రారంభిస్తారు. అంతేకాక కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆతర్వాత నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో గురుకుల పాఠశాల భవనం మరమ్మతు పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, నాచేపల్లి, బైరవునిపల్లి, గువ్వలగూ డెం, అప్పలనరసింహాపురం, కట్టుకాచారాంలో జరిగే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
రైల్వే సమస్యలపై
స్పందించండి
రైల్వే మంత్రిత్వ శాఖ ఈడీకి ఎంపీ వినతి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వికాస్‌కుమార్ జైన్‌కు గురువారం ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా వెళ్లనున్న డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్ – గద్వాల లైన్ అలైన్‌మెంట్‌ను మార్చి వెన్నారం, కురవి, అబ్బాయిపాలెం, మరిపెడ, మోతె మీదుగా లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ నుంచి న్యూ గొల్లగూడెం మీదుగా రహదారి విస్తరణకు 4,556 చ.మీ. రైల్వే భూమి అవసరమని తెలిపారు. ఇందుకు బదులుగా ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 9,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇవ్వనున్నందున ఇరు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఎంపీ కోరారు.
ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం
ఖమ్మం వైద్యవిభాగం: హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణలో జిల్లా ప్రథమ స్థానాన ఉందని అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందూనాయక్ తెలిపారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నుంచి మమతా రోడ్డు మీదుగా గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన చందూనాయక్ మాట్లాడడారు. కొత్తగా ఎయిడ్స్ కేసులు నమోదు కాకుండా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం సరఫరా త్వరగా పూర్తిచేయాలి
నేలకొండపల్లి: మూడు నెలల బియ్యం కోటాను రేషన్ షాపులకు త్వరగా తరలించాలని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీలత సూచించారు. నేలకొండపల్లిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే షాపులకు తరలించిన బియ్యం, ఇంకా ఎంత తరలించాల్సి ఉందో రికార్డుల ఆధారంగా పరిశీలించారు. షాపుల్లో బియ్యం నిల్వలు అయిపోకముందే సరిపడా తరలించాలని తెలిపారు. అలాగే, పాడైన పంచదార వేలం పాటను పరిశీలించగా, 50.13 క్వింటాళ్ల చక్కెరను సోమయ్య కిలో రూ.6 చొప్పున దక్కించుకోవడంతో వివరాలు ఆరా తీశారు. జిల్లాలోని ఐదు స్టాక్ పాయింట్లలో పాడైన 23.842 క్వింటాళ్ల పంచదారను వేలం ద్వారా విక్రయిస్తున్నామని డీఎం తెలిపారు. నేలకొండపల్లి గోదాం ఇన్‌చార్జ్ లక్ష్మణ్, ఎంఆర్‌ఐ ఆలస్యం మధుసూధన్‌రావు పాల్గొన్నారు.


