గుడిసెల గుర్తింపునకు సర్వే | - | Sakshi
Sakshi News home page

గుడిసెల గుర్తింపునకు సర్వే

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

● అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకాశం ● ఇప్పటికే ప్రజావాణికి వేలాదిగా దరఖాస్తులు ● సర్వే తర్వాత ప్రాధాన్యతా క్రమాన కేటాయింపు

కమిటీల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు

క్షేత్ర స్థాయిలో కార్యదర్శులు..

● అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకాశం ● ఇప్పటికే ప్రజావాణికి వేలాదిగా దరఖాస్తులు ● సర్వే తర్వాత ప్రాధాన్యతా క్రమాన కేటాయింపు

ఖమ్మంగాంధీచౌక్‌: జిల్లాలో పూరి గుడిసెలను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల రహిత తెలంగాణే లక్ష్యంగా తీర్చిదిద్దాలని నిర్ణయించడంతో జిల్లాలో సర్వే మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పునజిల్లాకు 16,495 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, ఇళ్లు మంజూరు కాని పేదలు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 6వేలకు చేరినట్లు అంచనా. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటూనే గుడిసెల్లో నివసించే వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది.

వివరాలు ఆరా...

గుడిసెల్లో, టార్పాలిన్ల కింద నివసించే వారిని గుర్తించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఇటీవల ఆదేశించారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ కార్యదర్శులతో కూడిన బృందాలు సర్వే ప్రారంభించాయి. ప్రజావాణిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి గృహాలను పరిశీలిస్తున్నారు. ఇళ్లు మంజూరు కాకపోవడానికి కారణాలు ఏమిటి, అర్హులు కాదా, స్థలం ఉన్నా తాత్కాలికంగా వలస వెళ్లారా... లేక ఇందిరమ్మ కమిటీ సిఫారసు చేయలేదా తదితర వివరాలు ఆరాతీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఆ సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక అందించాక అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించే అవకాశముందని తెలుస్తోంది.

ఆసక్తి చూపకపోతే అర్హులకు..

మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 1,943 మంది నిర్మాణాలు మొదలుపెట్టలేదు. వీరిలో 252 మంది ఆర్దిక ఇబ్బందులతో నిర్మించుకోలేకపోయారని యంత్రాంగం గుర్తించింది. దీంతో వీరికి రుణం అందించి నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మిగతా 1,691 మంది విషయంలో సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందులో ఎవరైనా ఆసక్తి చూపకపోతే రద్దు చేసి గుడిసెల సర్వేలో తేలే అర్హులకు కేటాయించనున్నారు. తద్వారా ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలోనే కొందరికి అవకాశం దక్కనుంది. మిగిలిన వారికి రెండో విడతలో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెబుతున్నారు.

గుడిసెల గుర్తింపు సర్వే ఆధారంగా అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అవకాశం ఉంది. ఇళ్ల కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సర్వే తర్వాత అందే నివేదిక ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో ఇళ్ల మంజూరవుతాయి. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది. – బి.శ్రీనివాస్‌,

నోడల్‌ అధికారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ

నేలకొండపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా ఇంకా గుడిసెలు, టార్పాలిన్‌ షీట్ల పైకప్పు కింద నివసిస్తున్నారు వారు ఎందరు, వారికి స్థలం ఉందా, ఇళ్లకు అర్హులేనా, లేదా అన్నది తేల్చేందుకు క్షేత్ర స్థాయిలో చేపట్టిన సర్వే కొనసాగుతోంది. ఈమేరకు గ్రామాల వారీగా కార్యదర్శులు పూర్తి వివరాలు సేకరించడమే కాక గుడిసె, టార్పాలిన్‌ పైకప్పు ఇంటి వద్ద ఫొటో తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement