భూదాన్.. రగడ
ఇదీ చరిత్ర
ఇళ్ల తొలగింపుతో నిరాశ్రయులైన పేదలు
స్థలాలు ఇప్పిస్తామని
రూ.లక్షలు వసూలు చేసిన దళారులు
జాబితా రూపకల్పన.. వివరాల
సేకరణలో నిమగ్నమైన యంత్రాంగం
అర్హులకు న్యాయం చేస్తాం..
ఖమ్మం సమీపాన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల తొలగింపు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇళ్ల కూల్చివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇక్కడ 31.07 ఎకరాల భూమి ఉండగా, హైకోర్టు, భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో ఈనెల 24న ఆక్రమణలను తొలగించినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. స్థానికులే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఆక్రమించారని.. అందులో కొందరు పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేసి స్థలాలు అంటగట్టినట్లు సమాచారం. ఈనేపథ్యాన అర్హులు, అనర్హులెవరనే లెక్కలు తీయడంలో యంత్రాంగం నిమగ్నమైంది. అంతేకాక భూమి భూదాన్ యజ్ఞ బోర్డుదిగా చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
మాకు పట్టాలు ఉన్నాయి..
భూదాన్ బోర్డు నుంచి తమకు అధికారంగా పట్టాలు వచ్చాయని కొందరు చూపిస్తున్నారు. 2014లో 1,895 మందికి పట్టాలు ఇవ్వగా.. రూపాయి రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెబుతున్నారు. గత పదేళ్లలో ఎవరూ ఇబ్బంది పెట్టకపోగా.. ఇప్పుడు అనుమతి, పట్టాలు లేవంటూ చెబుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలంలో కొందరు రేకుల ఇళ్లలో ఉంటుండగా, మరికొందరు స్లాబ్ వేసుకున్నారు. అయితే, అధికారులు మాత్రం భూదాన్ బోర్డు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదని, కోర్టు ఆదేశాలతోనే కూల్చామని చెబుతున్నారు.
అక్రమార్కులకు బంగారు బాతు
దాదాపు 31–07 ఎకరాల భూమి అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డులా మారింది. కొందరు భూములను ఆక్రమించుకున్నాక అమాయకులను నమ్మించి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ శాఖ చేపట్టిన విచారణలో నకిలీ పత్రాలను గుర్తించారు. స్థానికులే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఆక్రమించుకోగా భూమాఫియా జోక్యంతో భారీగా అక్రమాలు జరిగాయని సమాచారం. ఈమేరకు 13కేసులు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముఠాగా ఏర్పడి ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులుగా చెబుతూ ఇంటి స్థలాలు కేటాయిస్తున్నామని రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
స్థానికులెవరు.. ఇతరులెవరు ?
భూదాన్ భూముల్లో కూల్చివేతలపై బీఆర్‌ఎస్, వామపక్షాలతో పాటు బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. అయితే కొందరు పేదలు సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో అక్రమార్కులను నమ్మి డబ్బు చెల్లించి నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఇలాంటి వారు కూడా నిరాశ్రయుల్లో ఉండడంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే అర్హులు ఎవరు, అనర్హులు ఎందరనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. ఖమ్మం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల వారే కాక భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల వారు కూడా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో బయటపడినట్లు తెలిసింది. ఇప్పటివరకు 720మందితో జాబితా రూపొందించగా.. అందులో అర్హులెవరో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం జాబితా సిద్ధమై స్థానిక పేదలెవరో తేలితే ప్రభుత్వం ఆదుకోనుందని సమాచారం.
1953లో కలవల రాజా రామారావుకు సర్వే నంబర్లు 147, 148, 149ల్లో ఉన్న 31–07 ఎకరాల భూమిని భూదాన్ ఉద్యమంలో భాగంగా దానం చేశారు. ఇందులో కొంత భూమిపై కబ్జాదారుల కన్ను పడగా.. మరికొంత స్థలంలో కట్టడాలు వెలిశాయి. ఇవి ఆక్రమణలేనని రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయగా.. పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇలా ఏళ్లుగా వివాదం సాగుతోంది. ఈ భూమి సమీపానే కలెక్టరేట్ నిర్మాణం జరగడంతో విలువ పెరిగింది. కూల్చివేతల అనంతరం భూమి విలువ రూ.250 కోట్ల మేర విలువ ఉందని అధికారులు వెల్లడించడం హాట్‌టాపిక్ అయింది.
వెలుగుమట్లలో
31.7 ఎకరాల భూములు
వెలుగుమట్లలోని భూదాన్ భూముల విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుంది. సీసీఎల్‌ఏ, హైకోర్టు ఆదేశాలతో భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆక్రమణల కూల్చివేతల సమయాన హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసినా కోర్టు తిరస్కరించింది. భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ శాఖ నిర్వహించిన విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు బయటపడ్డాయి. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. స్వాధీనం చేసుకున్న భూమిని ప్రజావసరాల కోసం వినియోగిస్తాం. ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులైన స్థానిక పేదలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్
భూదాన్.. రగడ
భూదాన్.. రగడ


