బిగుస్తున్న ఈడీ ఉచ్చు..! | - | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఈడీ ఉచ్చు..!

Feb 1 2026 3:15 AM | Updated on Feb 1 2026 3:15 AM

బిగుస్తున్న ఈడీ ఉచ్చు..!

బిగుస్తున్న ఈడీ ఉచ్చు..!

ఇద్దరు సైబర్‌ నేరస్తుల అరెస్ట్‌

సత్తుపల్లి/పెనుబల్లి: సైబర్‌, ఆర్థిక నేరాల కేసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు అప్పజెప్పినట్లు సమాచారం. జనవరి 11న ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ వీఎం బంజర్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రకటించిన విధంగానే కేసులను బదిలీ చేసినట్లు తెలిసింది. అంతర్జాతీయస్థాయి హవాలా, మనీ లాండరింగ్‌ రూపంలో సైబర్‌ ఆర్థిక నేరాలు విచారణలో బయటపడుతుండటం.. రూ.వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరగడంతో కేంద్ర విచారణ సంస్థలు రంగంలో దిగినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా, కంబోడియా, మయన్మార్‌ దేశాలతో పాటు పలు రాష్ట్రాల్లో సైబర్‌ క్రైమ్‌లతో రూ.కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌కు బెయిల్‌ వచ్చింది. మరో 18 మంది నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు మోరంపూడి చెన్నకేశవరావు, ఉడతనేని వికాస్‌చౌదరి పరారీలో ఉన్నారు.

పోట్రు మనోజ్‌కల్యాణ్‌ విచారణలో..

సైబర్‌ ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరు, సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కల్యాణ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. రూ.547 కోట్లు కాస్తా రూ.వెయ్యి కోట్లు దాటి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలియటం.. మరికొందరు నిందితుల పేర్లు వెలుగులోకి రావటంతో కేసు మలుపుతిరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన బొప్పన నాగప్రసాద్‌ కీలక సూత్రదారిగా మనోజ్‌కల్యాణ్‌ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో అతడిని కూడా అరెస్ట్‌ చేశారు. బెట్టింగ్‌ యాప్‌, క్రిప్టో కరెన్సీ, హవాలా, మనీలాండరింగ్‌పై బొప్పన నాగప్రసాద్‌ సహకారంతోనే ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు విచారణలో పోలీసులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొందరు సైబర్‌ క్రైమ్‌ నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

పోలీసు కస్టడీకి నిందితులు..

సైబర్‌ క్రైమ్‌లో ప్రధాన నిందితులైన పోట్రు మనోజ్‌కల్యాణ్‌, బొప్పన నాగప్రసాద్‌లతో పాటు మరికొందరిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సైబర్‌ క్రైమ్‌ తీవ్రత దృష్ట్యా వివరాలు బయటికి వెల్లడించలేమని పోలీసులు చెబుతున్నారు. పోలీసు విచారణ తీవ్రతరం కావటం.. మరో వైపు ఈడీ రంగ ప్రవేశంతో సైబర్‌ క్రైమ్‌కు సహకరించిన వారిలో టెన్షన్‌ నెలకొంది. బయట ఉన్న ప్రధాన నిందితులు ఇతర దేశాలకు పరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు దుబాయ్‌, ఇతర దేశాల్లో తలదాచుకున్నారని సమాచారం.

కస్టడీకి సైబర్‌ నిందితులు

ఖమ్మంక్రైం: ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మంచి సుమారు రూ.18 లక్షలు దండుకున్న కేసుల్లో ఇద్దరు వ్యక్తులను ఖమ్మం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు శనివారం సీపీ సునీల్‌దత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని వైజాగ్‌కు చెందిన ఉమాశంకర్‌, హేమలత ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగికి ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే లాభాలు గడించవచ్చని ఆశ చూపి విడతలవారీగా రూ.18 లక్షలు చోరీ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఖమ్మం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి విచారించగా.. ఉమాశంకర్‌, హేమలత బ్యాంక్‌ ఖాతాలకు వెళ్లినట్లు తేలింది. దీంతో వైజాగ్‌కు వెళ్లి వారిద్దరిని అరెస్ట్‌ చేశారని సీపీ వివరించారు. సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ ఫణిందర్‌, సీఐ నరేశ్‌, ఎస్‌ఐలు రంజిత్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు భానుమూర్తి, కిషన్‌రావు, కృష్ణప్రసాద్‌, అఫ్సనాను సీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement