బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

Oct 19 2025 6:13 AM | Updated on Oct 19 2025 6:13 AM

బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

● బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పిలుపు ● మద్దతు తెలిపిన అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ● మధ్యాహ్నం వరకు డిపోలు దాటని బస్సులు

రూ.1.10 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్‌టీసీ

● బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పిలుపు ● మద్దతు తెలిపిన అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ● మధ్యాహ్నం వరకు డిపోలు దాటని బస్సులు

ఖమ్మంమయూరిసెంటర్‌: బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇకనైనా జనాభా దామాషా ప్రకారం 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని.. లేకుంటే రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యాన శనివారం రాష్ట్ర బంద్‌లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన బంద్‌ ప్రశాంత వాతావరణంలో విజయవంతమైంది. బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులే కాక ప్రజా, విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈమేరకు శనివారం తెల్ల వారుజామున 4గంటలకే జేఏసీ, అఖిలపక్ష పార్టీల నాయకులు ఖమ్మం బస్‌డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం ఖమ్మం పాతబస్టాండ్‌ ఎదురుగా జేఏసీ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. బంద్‌తో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోగా, పెట్రోల్‌ బంక్‌లు, షాప్‌లను స్వచ్ఛందంగా మూసివేశారు.

రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే..

జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గుండాల కృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకుడు మందుల రాజేంద్రప్రసాద్‌ తదితరులు మాట్లాడుతూ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి ఆమోదింపజేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉన్న పాలకులు తమ అవసరాలకు బీసీలను వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీలు, కుల, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, కొత్తా సీతారాములు, ఆకుల గాంధీ, ఆవుల అశోక్‌, వై.విక్రమ్‌, శెట్టి రంగారావు, బిచ్చాల తిరుమలరావు, కత్తి నెహ్రూ, జి.రామయ్య, పుచ్చకాయల వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, చెరుకుపల్లి నాగేశ్వరరావు, సిద్దా సాహెబ్‌, షేక్‌ షకీనా, ఎలమందల జగదీష్‌, పిండిపోలు రామ్మూర్తి చిలకల వెంకటనర్సయ్య, తూరుగంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీల బంద్‌కు బీజేపీ నాయకులు సైతం మద్దతు తెలిపి కొత్త బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఇక ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐ ఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యాన నగరంలో తెరిచి ఉన్న విద్యాసంస్థలను మూసివేయించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోరుతూ చేపట్టిన బంద్‌ ప్రభావం ఆర్టీసీపై పడింది. శనివారం తెల్లవారుజాము నుంచే నాయకులు రీజియన్‌లోని ఏడు డిపోలు, బస్టాండ్ల ఎదుట బైఠాయించారు. దీంతో అధికారులు బస్సులను డిపోలు, బస్టాండ్లకే పరిమితం చేశారు. రీజియన్‌లో 562 బస్సులకు గాను 450 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని బస్సులను మధ్యాహ్నం తర్వాత నడిపించినా పెద్దగా ఫలితం కానరాలేదు. దీంతో ఆర్టీసీ రూ.1.10 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. కాగా, బస్సులు లేకపోవడంతో దీపావళికి స్వస్థలాలకు బయలుదేరిన వారు ఇబ్బంది పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement