
కారులో జర్నీ.. స్టార్ హోటళ్లలో బస
● 20 కేసుల్లో నిందితుడిగా హైటెక్ దొంగ ● వివరాలు వెల్లడించిన నగర ఏసీపీ రమణమూర్తి
ఖమ్మంఅర్బన్: యుక్త వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయి చిన్నచిన్న పనులు చేస్తే వచ్చే డబ్బుతో సంతృప్తి లభించలేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న సదరు వ్యక్తి పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మార్చుకోలేదు. చోరీసొత్తుతో కొన్న కారులోనే దొంగతనాలకు వెళ్లే ఆ నిందితుడు ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవనం సాగి స్తుండగా ఖమ్మంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు.
గుంటూరు నుంచి హైదరాబాద్‌కు..
ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శ్యామ్‌రిచర్డ్ 17 ఏళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయాడు. హైదరాబాద్‌లోని ఓ జిరాక్స్ సెంటర్‌లో పనికి కుదిరినా వచ్చే డబ్బు సరిపోక దొంగతనాలు మొదలుపెట్టాడు. అలా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్, సరూర్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, జీడి మెట్ల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవాడు. ఫలితంగా పోలీసులకు పట్టుబడి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా తీరు మార్చుకోలేదు. జిల్లాలోని ఖానాపురం హవేలీ, ఖమ్మం – 1, 2, 3 టౌన్‌తో పాటు రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఇళ్లలో చోరీ చేశాడు. శుక్రవారం సాయంత్రం ఖమ్మంఅర్బన్ పోలీసులు ఖమ్మం – వైరా రహదారిపై వాహన తనిఖీలు చేపడుతుండగా కారులో వెళ్తున్న వంశీకృష్ణ వివరాలు ఆరా తీశారు. దీంతో చోరీల విషయం బయటపడింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించడంతో 452గ్రాముల బంగారు నగలు (ప్రస్తుత విలువ రూ.51 లక్షలు), చోరీ సొమ్ముతో కొన్న ఎంజీ ఆస్టర్ కారు (రూ.15 లక్షలు) కలిపి రూ.66 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, చోరీ సొత్తును ఎప్పటికప్పుడు అమ్మేసే వంశీకృష్ణ ఆ డబ్బుతో బెంగళూరు, గోవా, హైదరాబాద్ నగరాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, ఎస్‌ఐ డి.శ్రావణ్‌కుమార్, సిబ్బంది వి.బాబు, వి.హరికృష్ణను ఏసీపీ అభినందించారు.