
చూసొద్దాం రండీ !
పాత ధరలే అమలు..
పునః ప్రారంభమవుతున్న పాపికొండల యాత్ర
వరదలతో ఆగిపోయిన పర్యాటకం
రాజమండ్రి వైపు ఇప్పటికే మొదలు..
నేడో, రేపో పోచవరం పాయింట్ వైపు
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో పర్యాటక రంగానికి పట్టుగొమ్మలాంటి పాపికొండల యాత్ర మళ్లీ సిద్ధమవుతోంది. వర్షాకాల సీజన్‌లో గోదావరి వరదల నేపథ్యంలో పర్యాటక యాత్ర నిలిచిపోగా.. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి గోదావరి ప్రవాహం నిలకడగా ఉండడంతో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏపీలోని రాజమండ్రి గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్‌కు అనుమతులు రావడంతో వారం కిత్రమే అక్కడ ప్రారంభించారు. కాగా గోదావరికి ఇవతల వైపున ఉన్న పోచవరం పాయింట్‌కు నేడో, రేపో అధికారిక అనుమతి రానుందని లాంచీల యజమానులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌కు పాపికొండల పర్యాటకాన్ని తిలకించేందుకు పలువురు రెడీ అవుతున్నారు.
దసరా నాటికే కావాల్సి ఉన్నా..
ప్రతి ఏడాది భద్రాచలం నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారీగా వరదలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పాపికొండల విహారయాత్ర నిలిపేస్తుంటారు. ఈ ఏడాది జూలైలోనే ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఈ సంవత్సరం భారీ వరదలు రాకున్నా గోదావరి నదీ ప్రవాహం నిరంతరం 30 – 45 అడుగుల మధ్య నమోదవుతూనే ఉంది. ఈ ఏడాది అత్యధిక పర్యాయాలు గోదావరి పరవళ్లు తొక్కడంతో పాపికొండల యాత్ర ఆలస్యమైంది. దసరా సెలవుల నుంచే పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. కానీ ఈ ఏడాది విజయదశమి నాటికి కూడా గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి రాకపోవడంతో జాప్యం జరిగింది.
దీపావళి నేపథ్యంలో ఎదురుచూపులు..
మూడు నెలలుగా ఆగిపోయిన పాపికొండల పర్యాటకానికి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం రాజమండ్రి వైపు నుంచి అనుమతి ఇచ్చింది. గండిపోచమ్మ గుడి బోటింగ్ పాయింట్ వద్ద వారం క్రితమే యాత్ర ప్రారంభమైంది. అయితే తెలంగాణ వైపు నుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే పోచవరం పాయింట్ వద్ద అనుమతి కోసం ఏజెంట్లు, లాంచీల యజమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదివారం, దీపావళి సెలవులు రావడంతో త్వరగా అనుమతిస్తే బాగుండేదని అంటున్నారు. యాత్రకు సంబంధించిన అన్ని పత్రాలూ సమర్పించామని, ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యమని లాంచీల యజమానులు చెబుతున్నారు. వీరితో పాటుగా పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ రంగాల ప్రజలు సైతం యాత్ర ప్రారంభం కోసం వేచిచూస్తున్నారు. పాపికొండల యాత్ర ప్రారంభమైతే ఇటు ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రగిరిలోనూ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.
పాపికొండల విహార యాత్ర నేడో, రేపో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి వైపు యాత్ర నడుస్తోంది. పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద లాంచీలు సిద్ధంగా ఉన్నాయి. అనుమతి వస్తే ఇక సందడిగా మారనుంది.
– మహేందర్, టికెట్ల విక్రయ కేంద్రం
నిర్వాహకుడు, భద్రాచలం
పచ్చని అడవులు, వాటి నడుమ అమాయక ఆదివాసీల జీవన విధానం, కట్టూబొట్టు, సంస్కృతి, సంప్రదాయాలు దర్శనమిచ్చే పాపికొండల యాత్ర ఎంతో మధురానుభూతిని నింపుతుంది. రెండు రోజుల్లో కార్తీక మాసం సైతం ప్రారంభం కానుండడంతో భక్తులు, పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో పాపికొండల పర్యాటక ధరలను గతంలో మాదిరిగానే నిర్ణయించారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక కళాశాల, పాఠశశాలల విద్యార్థులకు ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్దకు చేరుకోవడానికి సొంత వాహనాల్లో లేదంటే భద్రాచలంలో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

చూసొద్దాం రండీ !

చూసొద్దాం రండీ !