
సేవాభావంతోనే వైద్యరంగంలో ఉన్నతి
‘వైట్ కోట్ సెర్మనీ’లో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య వృత్తి పవిత్రమైందని.. చికిత్స కోసం వచ్చే వారితో సేవాభావం కలిగి ఉండడం ద్వారా వృత్తిలో ఉన్నతి సాధ్యమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం నిర్వహించిన నూతన బ్యాచ్ వైట్ కోట్ సెర్మనీలో ఆయన మాట్లాడారు. ప్రజలు వైద్యులపై అపారమైన నమ్మకంతో వస్తారని, వైద్యులను దేవుళ్లుగా కొలుస్తారని తెలిపారు. వైద్య వృత్తిని ఎన్నుకున్న విద్యార్థులు వృత్తిలో రాణించడమే కాక పేద, ధనిక బేధం లేకుండా చికిత్స అందించాలనే తపన కలిగి ఉండాలని చెప్పారు. ఇటీవల తమ కుటుంబంలోని ఒకరికి కీలకమైన సర్జరీ నిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించారన్నారు. కోయంబత్తూర్‌కు చెందిన అరవింద్ అనే ఆఫ్తమాలజిస్ట్ తన కెరీర్‌లో వేల మందికి చికిత్స చేసి కంటి చూపును కాపాడారని తెలిపారు. వృత్తిపై ప్రేమ కలిగి ఉండడం, దానిపై పట్టు సాధించడం, కాలానుగుణంగా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరొచ్చని కలెక్టర్ వెల్లడించారు. ఇదే సమయాన వైద్యులు సైతం ఒత్తిడి తగ్గించుకుంటూ వారి ఆరోగ్యంపైనా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు వైట్ కోట్లు అందజేసి ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు సరిత, సృజన, వేణు, కిరణ్ కుమార్, రాంప్రసాద్, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.