
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్ పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరి పించారు. అలాగే, పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన
ఆర్‌టీఐ కమిషనర్
ఖమ్మం సహకారనగర్: ఆర్‌టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు, అధికారులకు అవగాహన, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్‌తో ఆయన చర్చించారు.
దీపావళికి
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్
ఖమ్మంమయూరిసెంటర్: దీపావళి పండుగ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చి నట్లు ఉమ్మడి జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్ బాబు తెలిపారు. రూ.1కే సిమ్ అందించడమే కాక 30 రోజుల కాల పరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా సిమ్ తీసుకునే వారికే కాక పోర్టబిలిటీ వినియోగదారులకు సైతం ఈ ప్లాన్ వర్తిస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో సంప్రదించాలని డీజీఎం ఓ ప్రకటనలో సూచించారు.
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
ఖమ్మం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం గొల్లగూడెం శ్రీ కృష్ణ గోశాలలో శనివారం పశువులకు వ్యాక్సిన్ వేశాక ఆయన మాట్లాడారు. రైతులంతా తమ పశువులకు వ్యాక్సిన్ వేయించాలని, తద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈసందర్భంగా గోశాలలో 644 పశువులకు టీకాలు వేశారు. డాక్టర్ కాంతికుమార్, ఉద్యోగులు మణిదీప్, కృష్ణ, సత్యనారాయణ, గోశాల బాధ్యులు కేసా హన్మంతరావు, అకితే చౌదరి పాల్గొన్నారు.
మొక్కజొన్న సాగుకు అగ్రిమెంట్ తప్పనిసరి
వైరా: విత్తన మొక్కజొన్న కంపెనీల ప్రతినిధులతో అన్ని అంశాలపై అగ్రిమెంట్ చేసుకున్నాకే రైతులు సాగు మొదలుపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలో ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీతో కలిసి ఆయన రైతులకు అవగాహన కల్పించారు. నోటి మాటగా చెప్పే ఏజెంట్లను నమ్మకుండా తప్పక అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. నమ్మకమైన ఏజెంట్ల వద్ద మాత్రమే విత్తనాలు తీసుకోవాలని, లాభా ల పేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాట లను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పారు. కాగా, పత్తి రైతులు పంట నమోదు చేయించుకోవడమేకాక సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని డీఏఓ సూచించారు. ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ రాజేష్, రైతులు పాల్గొన్నారు

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం