పోడు భూములు పచ్చగా.. | - | Sakshi
Sakshi News home page

పోడు భూములు పచ్చగా..

Aug 4 2025 3:53 AM | Updated on Aug 4 2025 3:53 AM

పోడు

పోడు భూములు పచ్చగా..

● ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ద్వారా అభివృద్ధికి ప్రణాళిక ● నీటి పారుదలకు సోలార్‌ పంపుసెట్ల మంజూరు ● ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 73,733 మంది రైతులకు లబ్ధి ● 2.23 లక్షల ఎకరాల మేర సాగుకు ప్రయోజనం

ఖమ్మంవ్యవసాయం: పోడు భూముల(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌)ను ఉద్యాన వనాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పథకాన్ని రూపొందించింది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) భూములు గిరిజన ప్రాంతంలో ఉండటం, ఆయా భూములను గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హక్కులు కల్పించారు. గిరిజనులు ఆ భూముల్లో వర్షాధారంగా మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. సారవంతమైన ఈ భూ ములను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల ప్రణాళికతో ఈ పథకానికి రూపకల్పన చేసి, అమలు బాధ్యత గిరిజనాభివృద్ధి సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో 2,30,735 మంది గిరిజన రైతులకు చెందిన 6.69 లక్షల ఎకరాల భూమిని రూ.12,600 కోట్లతో అభివృద్ధి చేసి, ఉద్యాన వనాలను పెంచా లని నిర్ణయించింది. రాష్ట్రంలోని 17జిల్లాల్లో ఉన్న పోడు భూముల అభివృద్ధికి ఈ పథకాన్ని వర్తింప జేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2025–26 నుంచి 2029–30 వరకు అమలు చేయనున్న ఈ పథకంలో తొలి ఏడాది ప్రయోగాత్మకంగా తక్కువ మంది రైతులు, తక్కువ విస్తీర్ణంలో.. తరువాత నాలుగేళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోనున్నారు. తొలి ఏడాది 10వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాల్లో పథకాన్ని అమలు చేసే విధంగా రూ.600 కోట్లతో అంచనాలు రూపొందించారు.

తిరిగి పచ్చదనం

పూర్వం దట్టమైన అడవులతో ఉన్న భూములను ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు జీవనోపాధి కోసం సాగు భూములుగా మార్చుకున్నారు. దీంతో అడవులు క్రమంగా అంతరించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పథకంలో భాగంగా పోడు భూముల అభివృద్ధి, ఉద్యాన పంటల సాగును చేపట్టనుండటంతో గిరిజనుల జీవనోపాధి మెరుగుపర్చడమే కాకుండా తిరిగి ఆ భూములు అడవులను తలపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రోత్సాహకాలు అందించి ఆయిల్‌ పామ్‌, మా మిడి, జామ, సపోట వంటి తోటలను పండించేలా చర్యలు చేపడుతున్నారు.

సోలార్‌ పంపుసెట్ల మంజూరుకు ప్రణాళిక

పథకంలో భాగంగా నీటి సౌకర్యం రెండున్నర ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకుని, వంద శాతం సబ్సిడీతో సోలార్‌ పంపుసెట్‌ను అందిస్తారు. ఒక యూనిట్‌కు రూ.6 లక్షల వ్యయంతో 200 అడుగుల లోతు బోరుగుంత తీసి, కేసింగ్‌ వేసి, పంపుసెట్‌ ఏర్పాటు చేస్తారు. సోలార్‌ పలకలు అమ ర్చి, ఇన్వర్టర్‌ ఏర్పాటు, పంపుసెట్‌, సోలార్‌ పలకల చుట్టూ ఫెన్సింగ్‌ వంటి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎంపిక చేసిన కంపెనీలు ఐదేళ్ల పాటు నిర్వహిస్తాయి. ఐదేళ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 73,733 మంది రైతులకు చెందిన 2.23 లక్షల ఎకరాలకు అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 11,386 మంది రైతులకు చెందిన 27,448 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62,347 మంది రైతులకు చెందిన 1,95,998 ఎకరాల పోడు భూముల్లో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ఏడాది మాత్రం ఖమ్మం జిల్లాలో 550 మంది రైతులకు చెందిన 1,516 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,923 మంది రైతులకు చెందిన 8,046 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.

మార్గదర్శకాలు అందాల్సి ఉంది..

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలులో భాగంగా సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. వాటి ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల పోడు భూముల్లో సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పలు కంపెనీల ద్వారా సోలార్‌ పంపుసెట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

–పి. అజయ్‌కుమార్‌,

రెడ్‌కో మేనేజర్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఐదేళ్ల పాటు ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ప్రణాళిక

ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు

2025–26 550 1,516 2,923 8,046

2026–27 2,809 6,483 14,856 46,988

2027–28 2,809 6,483 14,856 46,988

2028–29 2,809 6,483 14,856 46,988

2029–30 2,809 6,483 14,856 46,988

మొత్తం 11,786 27,448 62,347 1,95,988

పోడు భూములు పచ్చగా..1
1/2

పోడు భూములు పచ్చగా..

పోడు భూములు పచ్చగా..2
2/2

పోడు భూములు పచ్చగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement