
ఇజ్రాయిల్.. దాడులు నిలిపివేయాలి
● 7న పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి సీపీఎం మద్దతు ● పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా ఇజ్రాయిల్.. పాలస్తీనాపై చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనాపై ఇజ్రాయిల్ కొన్నేళ్ల నుంచి యుద్ధం చేస్తూ, వేల మంది ప్రాణాలను బలిగొందని విమర్శించారు. కనీస యుద్ధ నియమ, నిబంధనలను పాటించకుండా విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తోందని, ముఖ్యంగా గాజాలోని పాఠశాలలు, వైద్యశాలలు, పౌర సముదాయాలు, రేషన్ దుకాణాలపై యుద్ధోన్మాదంతో దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సుమారు 56,000 మంది పాలస్తీనా పౌరులు చనిపోయినట్లు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయని, అందులో సుమారు 20 వేల మంది పసిపిల్లలు ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఆగస్టు 7న ఖమ్మం నగరంలో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ నిర్వహిస్తున్న ర్యాలీకి సీపీఎం సంఘీభావం తెలుపుతోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.