
మల్చింగ్ సాగు.. బాగు
ఇల్లెందురూరల్: రైతులు సాగు చేసిన పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తుంటాయి. దీనికి తోడు తెగుళ్లు, చీడపీడల బెదడ వంటి పలు కారణాలతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా చేతికందక నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు క్రమంగా సాంకేతిక సాగు పద్ధతులు అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఘడించేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విపత్తులను తట్టుకుంటూ చీడపీడలు, కలుపు నియంత్రిస్తూ, తక్కువ మోతాదులో నీటి తడులతో ఆశించిన దిగుబడులు అందించే మల్చింగ్ సాగు విధానంపై రైతులు దృష్టిసారిస్తున్నారు.
షీట్ల ఎంపిక ఇలా..
ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కల సాగులో మల్చింగ్ షీట్లను అధికంగా ఉపయోగిస్తారు. 3 నుంచి 4 నెలల కాలవ్యవధి ఉండే పంటల సాగులో 50 మైక్రాన్ల మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తారు. 12 నుంచి 15 నెలల కాల వ్యవధి కలిగిన పంటల సాగులో 100 షీట్లను వాడటం మేలు. 7.25 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు ఒక పంట కాలానికి, 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు మూడేళ్ల వరకు మన్నిక కలిగి ఉంటాయి.
సాగు విధానం..
మల్చింగ్ పరిచే విధానం పలు రూపాలలో ఉంటుంది. విత్తనం వేయక ముందు, వేసిన తరువాత కూడా మల్చింగ్ షీట్లను కప్పేందుకు అవకాశం ఉంటుంది.
●మొక్క పాదుకు సరిపడా షీట్‌ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి.
●చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పడంతో పాటు మూడు, నాలుగు అర్థచంద్రాకారంలో రంద్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది.
●కూరగాయల పంటల్లో విత్తనాలు విత్తేముందు మొక్క మధ్యలో వరుసల మధ్య ఉన్న దూరాన్ని బట్టి ముందే షీట్‌కు రంధ్రాలు చేయాలి.
●షీట్‌ను నాగలి సాలు మీద పరిచి రెండు వైపులా కొనలపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుపోకుండా ఉంటాయి. ఆతర్వాత రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టి కప్పాలి.
●విత్తనాలు మొలిచాక మొక్క చుట్టూ షీట్‌ను తగిన సైజులో కత్తిరించి ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి.
●ఈ షీట్‌ను ప్రతీ వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరలకు గాడిలో పోయేలా చేసి మట్టితో కప్పాలి. దీనివల్ల మల్చింగ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది.
ప్రయోజనాలిలా..
భూమిపై ప్లాస్టిక్ షీట్ కప్పి బయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. సూర్యకిరణాలను మొక్క ప్రతి భాగానికి అందించి అనుకూలమైన పరిస్థితులను ఏర్పర్చడానికి వీలు కలుగుతుంది. కలుపు నివారణ 80 శాతం తగ్గుతుంది. 50శాతం వరకు సాగునీటి ఆదాతో పాటు తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో సాగుచేసే రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది.
కలుపు, చీడపీడల సమస్యకు చెక్
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు
ఆసక్తి చూపుతున్న ఏజెన్సీ రైతులు

మల్చింగ్ సాగు.. బాగు