
ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకుంటాం
సత్తుపల్లిటౌన్: ఈ ప్రాంత నిర్వాసితులకు చెందిన లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వకుండా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా ఇస్తే ప్రాణాలుపణంగా పెట్టి అయినా అడ్డుకుంటామని లారీ యజమానులు స్పష్టం చేశారు. సత్తుపల్లి సింగరేణి లారీ, టిప్పర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యా న ఆదివారం జరిగిన సమావేశంలో సింగరేణి యా జమాన్యం తీరుపై మండిపడ్డారు. నాణ్యమైన బొగ్గు ను సమయానికి ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అతిక్రమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సత్తుపల్లి, కిష్టారం ఓసీల్లో ఉత్పత్తి అయిన బొగ్గులో 30 శాతం లోడింగ్ స్థానిక లారీలకు కల్పించాలని కోరారు. బొగ్గు లోడింగ్ లేకపోవటం వల్ల లారీ యజమానులకు పూటగడవటం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 600 లారీలు ఉంటే.. రోజుకు రెండు లారీలకు లోడింగ్ ఇవ్వటం సింగరేణి అధికారుల తీరుకు నిదర్శనమన్నారు. ఆంధ్రా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ స్థానిక లారీలకు లోడింగ్ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొండపల్లి రమేశ్‌రెడ్డి, చిన్నంశెట్టి సూరిబాబు, మౌలాలి, మునీర్, రమేశ్, పాలకుర్తి దాసు, పీఎల్ ప్రసాద్, కోట మోహన్‌రావు, కోటేశ్వరరెడ్డి, ఐ.శ్రీనివాసరావు, మారేశ్వరరావు పాల్గొన్నారు.