
పునాదుల్లోనే ‘ప్రసాద్’..
● పథకం పనుల్లో అంతులేని జాప్యం ● భద్రాచలంలో రూ.41 కోట్లతో ప్రసాద్ పథకం పనులు ● 2022లో శిలాఫలకం వేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ● మూడు భవనాలు నిర్మించాల్సి ఉండగా.. ఒకటే ప్రారంభం
భద్రాచలం: ప్రసాద్ పథకం పునాదులకే పరిమితమైంది. ప్రారంభించి 17 నెలలు గడిచినా, గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నా పనులు ఇంకా బేస్‌మెంట్ దాటలేదు. కేంద్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చుల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి, పర్ణశాలల్లో పలు అభివృద్ధి పనులకు రూ.41 కోట్లు కేటాయించారు. 2022, డిసెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం రామయ్యను దర్శించుకోగా, అనంతరం ఆలయ ప్రాంగణంలోనే వర్చువల్ పద్ధతిన ఈ పనుల ప్రారంభోత్సవం చేశారు. టెండర్ ప్రక్రియ ఆలస్యంగా గత మే 12న ఓ ప్రైవేట్ కంపెనీకి ఖరారు చేశారు. మే–2024 లోపు మూడు భవన నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. తొలి విడతగా రూ. 22 కోట్లు విడుదల చేశారు.
రెండు భవనాల పనులే ప్రారంభించలేదు..
ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా, ఇప్పటివరకు ఒక్క భవనం కూడా పూర్తికాలేదు. మిథిలా స్టేడియం వెనుక గతంలో వాహనాల పార్కింగ్‌గా ఉపయోగించిన స్థలంలో యాత్రికుల గదులు, వ్రత మండపాలకు సంబంధించిన భవనం నిర్మాణం ఒక్కటే సాగుతోంది. ఆ పనులు కూడా పునాది దశలోనే ఉన్నాయి. ఇక ఆర్‌ఆండ్‌బీ స్థలంలో ఒక భవనం, నూతనంగా నిర్మించిన గోదావరి రెండో బ్రిడ్జి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో మరో భవనం నిర్మించాల్సి ఉంది. కానీ ఇంతవరకు పనులే ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో భద్రాచలం, పర్ణశాలలో పూర్తి చేయాల్సిన పనులు ఎంతకాలం పడుతుందోననే చర్చ భక్తుల్లో సాగుతోంది. నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్, పర్యవేక్షించాల్సిన టూరిజం శాఖ అధికారుల అలసత్వమే ఇందుకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భక్తులను వేధిస్తున్న వసతి సమస్య
భద్రాచలంలో ప్రధానంగా భక్తులను వసతి సమస్య వేధిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వసతి గదులు, డార్మెటరీ హాల్స్ కరువయ్యాయి. ప్రసాద్ పథకంలో నిర్మించే భవనాలు పూర్తయితే కొద్ది మేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కానీ అవి పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ప్రతి ఏడాది దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి, శ్రీరామనవమి, భక్త రామదాసు జయంతి, శబరి, పొకల దమ్మక్క ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుతున్నారు. వీటితోపాటు ఇటీవల కాలంలో భక్తుల రాక పెరిగింది. దీంతో వసతి సమస్య తీవ్రమవుతోంది.
వర్షాకాలం వస్తే..
రానున్న వర్షాకాలంలో వానలు, గోదావరి వరదలతో నిర్మాణ పనులు చురుకుగా సాగవు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ‘ప్రసాద్’పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులు కోరుతున్నారు. రామాలయంలో నిత్యకల్యాణ మంటప రూఫింగ్, అభయాంజనేయస్వామి ఆలయంలో, మిథిలా స్టేడియంలో డిటాచబుల్ రూఫ్‌లు, ఫ్లోరింగ్, ప్రసాదాల తయారీ విభాగపు ఆధునికీకరణ, టైల్స్ ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సమస్యలపై దేవస్థానం అధికారులు విన్నవించుకుంటున్నా.. పనులకు ‘మోక్షం’ లభించలేదు. నిర్మాణ పనుల్లో జాప్యంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. టూరిజం శాఖ అధికారులు అందుబాటులోకి రాలేదు.

పునాదుల్లోనే ‘ప్రసాద్’..