రేపు ఖమ్మం మార్కెట్‌కు సెలవు | - | Sakshi
Sakshi News home page

రేపు ఖమ్మం మార్కెట్‌కు సెలవు

Mar 3 2026 7:28 AM | Updated on Mar 3 2026 7:28 AM

ఖమ్మంవ్యవసాయం: హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటించారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు ఈ విషయాన్ని గుర్తించాలని మార్కెట్‌ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో సూచించారు.

ఈనెల 6, 7వ తేదీల్లో జాతీయ సదస్సు

నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6, 7వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలేటి పరంజ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీలో సోమవారం ఆయన వివరాలు వెల్ల డించారు. భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యాన ‘ఎకోస్‌ ఆఫ్‌ ది పాస్ట్‌ బీమ్స్‌ ఆప్‌ లైట్‌.. ఎక్స్‌ ప్లోరింగ్‌ ది సైంటిఫిక్‌ పినామినా బీహైండ్‌ తెలంగాణ ఆర్కిటెక్చర్‌’ అంశంపై పీఎమ్‌ ఉషా(రూసా), తెలంగాణ ఉన్నత విద్యామండలి సౌజన్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి 60 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ నర్సింగ్‌ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్‌ డాక్టర్‌.రమేష్‌, టాస్క్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.నారాయణస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రపంచమంతా

శాంతి వెల్లివిరియాలి

ఖమ్మంరూరల్‌: ప్రపంచంలోని అన్ని దేశాల్లో శాంతి వెల్లివిరియాలని ఆల్‌ ఇండియా బిషప్‌ల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ పూల ఆంథోని అన్నారు. యుద్ధాలు జరిగితే అందరికీ అనర్ధదాయకమని పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కరుణగరిలో జరుగుతున్న ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆంథోని మాట్లాడుతూ ప్రతిఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని.. ప్రజలు సఖ్యత, ఐకమత్యంతో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నాయుడుపేట నుంచి కరుణగిరి వరకు కోలాటాల నడుమ వాహన ర్యాలీ నిర్వహించారు. ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, వైస్‌ చైర్మన్‌ తమ్మినేని నవీన్‌తో పాటు బిషప్‌ సగిలి ప్రకాష్‌, ఫాదర్‌ శౌరి, జాన్నేష్‌, ఆంటోని రాజ్‌, కొమ్ము ఆంథోని, మ్యాథ్యూ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఉద్యోగులకు పదోన్నతులు

సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీ ఉద్యోగులు పలువురికి పదోన్నతులు కల్పించారు. హెడ్‌ ఓవర్‌మెన్‌ గ్రేడ్‌–ఏ నుంచి గ్రేడ్‌–ఏ1గా ఐదుగురికి, గ్రేడ్‌–బీ నుంచి గ్రేడ్‌–ఏలోకి ఏడుగురికే కాక టైం రెటెడ్‌ వేకెన్సీలను ద్వారా ఐదుగురికి పదోన్నతి దక్కింది. అలాగే, కెరీర్‌ గ్రోత్‌ స్కీం ద్వారా కిష్టారం ఓసీలో ఒకరికి, జేవీఆర్‌ ఆర్‌సీహెచ్‌పీలో మెకానికల్‌ గ్రేడ్‌–బీ నుంచి గ్రేడ్‌–ఏ ఇంకొకరికి పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఉద్యోగులకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ పదోన్నతి పత్రాలు అందజేశారు. పీఓ ప్రహ్లాద్‌, ప్రాజెక్టు అధికారులు డి.శ్రీనివాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కళ్యాణ్‌రామ్‌, నాయకులు సుధాకర్‌, బి.కోటేశ్వరరావు, నర్సింహారావు, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ వ్యవస్థ రక్షణకు లైట్నింగ్‌ అరెస్టర్లు

ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పడు విద్యుత్‌ వ్యవస్థను రక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్‌ లైన్లు, పంపిణీ వ్యవస్థ, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లు, ఇతర పరికరాలు నష్టపోకుండా లైట్నింగ్‌ అరెస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సర్కిల్‌ పరిధిలో 109 లైట్నింగ్‌ అరెస్టర్లను అమర్చగా, ఇవి మెరుపు, పిడుగు సమయాన కలిగే అధిక వోల్టోజీని భూమిలోకి పంపిస్తాయని తెలిపారు.

చీఫ్‌ సూపరింటెండెంట్‌

తొలగింపు

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొగించారు. ఇటీవల పరీక్ష హాల్‌లో ఓ విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని మరో విద్యార్థికి అందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదుతో సోమవారం సీఎస్‌ను విధుల నుంచి తొలగించామని డీఐఓఈ రవిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement