డ్రోన్ల ద్వారా నిఘా..
భద్రాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో
అటవీ విస్తీర్ణం
అటవీ జంతువులను హతమారుస్తున్న వేటగాళ్లు
పలు కేసులు నమోదు..
పాల్వంచరూరల్: ఎన్ని చట్టాలు చేసినా వేటగాళ్ల వేటుకు వన్యప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. ఏటా అటవీ శాఖ, వైల్డ్‌లైఫ్ శాఖల అధికారులు జంతు సంరక్షణ చైతన్య దినోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నా అటవీ జంతువులకు హాని కలుగుతూనే ఉంది. అటవీశాఖ రికార్డులో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చే. 2021–2022లో జిల్లాలో జంతువుల వధపై 25 కేసులు నమోదయ్యాయి. 2022లో 31 కేసులు, 2023లో ఆరు, 2024లో మూడు, 2025లో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది పాల్వంచ వైల్డ్‌లైఫ్ విభాగం అధికారులు 303 ఉచ్చులు, బాణాలు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం క్రమంగా ఆక్రమణకు గురి అవుతుండటంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందినే ఆరోపణలు ఉన్నాయి. వేసవిలో జంతువులు నీళ్ల కోసం వచ్చే క్రమంలో వేటుగాళ్లు ఉచ్చులు పెట్టి వధిస్తున్నారు.
కిన్నెరసానిలో విభిన్న జంతువులు..
భద్రాద్రి జిల్లాలో అటవీ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల్లో ఉండగా, కిన్నెరసాని అభయారణ్యం 634.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అభయారణ్యంలో విభిన్న రకాల జంతువులు ఉన్నా యి. ఇటీవల పులులు సంచరించిన విషయం విదితమే. అడవి గేదెలు, దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు ఉన్నాయి. కిన్నెరసాని రిజర్వాయర్‌లో వేల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. ఇలా అనేక రకాల జంతువులు అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు.
జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై నిఘా పెట్టాం. బీట్ల వారీగా పర్యవేక్షణ చేపట్టాం. రాత్రి పూట కూడా కన్పించేలా అధనాతన పరిజ్ఞానం కలిగిన రెండు థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. పెట్రోలింగ్‌తో పాటుట సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం. అటవీ ప్రాంతంలో 30 బేస్‌క్యాంప్‌లను ఏర్పాటు చేసి 150 మంది సిబ్బందిని కూడా నియమించాం.
– జి.కృష్ణాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారి
నేడు ప్రపంచ వన్యప్రాణి
సంరక్షణ దినోత్సవం
జంతువుల సంరక్షణ కోసం 1972 నుంచి వైల్డ్‌లైఫ్ చట్టాలు అమలు చేస్తున్నారు. అయినా వేటగాళ్లు వన్యప్రాణుల ఉసురుతీస్తూనే ఉన్నారు. గతేడాది జూన్ 15న ములకలపల్లి రేంజ్‌లో వేటగాళ్లు నాటు తుపాకులతో సంచరిస్తూ పట్టుబడ్డారు. మే 26న అశ్వారావుపేట రేంజ్‌లో కస్తూరి జింక అవశేషాల ను పట్టుకున్నారు. ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్‌లో వండిన దుప్పి మాంసాన్ని పట్టుకున్నారు. ఏప్రిల్ 9న నాటుతుపాకులు కలిగిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. దమ్మపేట రేంజ్‌లోని పెద్దగొల్లగూడెంలో మేకల గుంపులో వచ్చిన దుప్పి పిల్లలను వేటా డి చంపారు. తాజాగా ఈ నెల1న ఖమ్మం జిల్లా కారేపల్లి రేంజ్‌లోని ముచ్చర్ల రామస్వామి గుట్ట సమీపంలో అడవి పంది మాంసాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని ఇద్దరిపై కేసు పెట్టారు.


